ముంబై: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన ఖాతాదారులకు పలు సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఖాతాదారుల ఇంటి వద్దకే పలు రకాల సేవలు అందిస్తున్నది. ఇంటి వద్దే క్షేమంగా ఉండండి ((Stay Home-Stay Safe)) అని పేర్కొంటూ అత్యవసర సేవల కోసం బ్యాంకుకు రానవసరం లేకుండానే సేవలందిస్తామంటున్నది.
ఇందులో భాగంగానే ఏటీఎం కమ్ డెబిట్ కార్డు పోతే బ్యాంకు శాఖకు రావాల్సిన అవసరం లేదని ఎస్బీఐ వెల్లడించింది.
పాత కార్డును బ్లాక్ చేయడంతోపాటు కొత్త డెబిట్ కార్డును కూడా ఫోన్ ద్వారానే పొందవచ్చని పేర్కొంటున్నది.
ఎస్బీఐ ఖాతాదారులు తమ డెబిట్ కార్డును పోగొట్టుకున్నట్లు గుర్తిస్తే ఆందోళనకు గురికానవసరం లేదు.
ఫోన్ కాల్ ద్వారా వెంటనే కార్డును బ్లాక్ చేయవచ్చు. ఇందుకోసం ఎస్బీఐ రెండు టోల్‌ఫ్రీ నంబర్లను కేటాయించింది.
1800-112-211, 1800-425-3800 అనే నంబర్లలో ఏదో ఒక ఫోన్ నంబర్‌కు కాల్ చేయాలి.
ఖాతాదారులకు అత్యవసర బ్యాంకింగ్ సేవలు అందించడం కోసం ఈ రెండు టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులోకి తెచ్చినట్లు ఎస్బీఐ వెల్లడించింది.
ఒకవేళ డెబిట్ కార్డు పోయినా, ఏటీఎం వద్ద గానీ, మరెక్కడైనా మర్చిపోయినా ఈ టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలి.
బ్లాక్ చేయడం కోసం ఎస్బీఐ నెట్ బ్యాకింగ్ వంటి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
ఇతర ఆప్షన్లతో పోలిస్తే ఫోన్ ద్వారా పోగొట్టుకున్న డెబిట్ కార్డు బ్లాక్ చేసేందుకు పట్టే టైం చాలా తక్కువ.
అలాగే డెబిట్/క్రెడిట్ కార్డు పిన్ జనరేషన్, బ్యాలెన్స్ తెలుసుకోవడం, చివరి ఐదు లావాదేవీల సమాచారం తెలుసుకోవచ్చు.
ఈ సమాచారాన్ని ఎస్సెమ్మెస్‌ల రూపంలో పొందడానికి కూడా ఈ టోల్‌ఫ్రీ నంబర్లకు కాల్ చేయొచ్చని ఎస్బీఐ వెల్లడించింది.
1800 112 211 నంబర్‌కు ఫోన్ చేసి ఎస్బీఐ కార్డ్ బ్లాక్ చేయాలంటే 2 నంబర్ ప్రెస్ చేయాలి. కార్డు చివరి ఐదు నంబర్లు ఎంటర్ చేస్తే సదరు డెబిట్ లేదా క్రెడిట్ కార్డు బ్లాక్ అవుతుంది.
ఎస్బీఐ డెబిట్ కార్డు విజయవంతం అయినట్లు ధ్రువీకరిస్తూ మీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ నంబర్‌కు ఎస్సెమ్మెస్ వస్తుంది.
కొత్త ఎస్బీఐ ఏటీఎం కార్డును పొందాలంటే sbicard.com వెబ్సైట్లోకి వెళ్లి.. రిక్వెస్ట్ ఆప్షన్ నొక్కాలి.
అటుపై రీ ఇష్యూ/ రీ ప్లేస్ కార్డు అని నొక్కాలి. అటుపై కార్డ్ నంబర్ ఎంపిక చేసి.. సబ్మిట్ ఆప్షన్ నొక్కితే సరి.
ఎస్బీఐ మొబైల్ యాప్‌లోకి వెళ్లే మెనూ ట్యాబ్ మీద ఎడమ వైపు టాప్ వద్ద సర్వీస్ రిక్వెస్ట్ నొక్కాలి. రీ ఇష్యూ/రీప్లేస్ కార్డు.. టాప్ చేయాలి. తర్వాత కార్డ్ నంబర్ ఎంపిక చేసిన సబ్మిట్ చేయాలి.
ఎస్బీఐకార్డ్ డాట్ కామ్ లేదా ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేయొచ్చు. 18004253800 అనే హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి కొత్త డెబిట్ కార్డు పొందొచ్చు.
ఎస్బీఐ డెబిట్ కం ఏటీఎం కార్డు రీ ఇష్యూ/ రీ ప్లేస్ చేయాలన్నా పన్నుతోపాటు రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఏడు వర్కింగ్ డేస్‌లో మీకు కొత్త డెబిట్ కార్డు వస్తుంది.