హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పనితీరుపై జనాల్లో నమ్మకం పూర్తిగా సన్నగిల్లిందని, ఈ సంక్షోభం నుంచి వ్యవస్థను కాపాడేందుకు సుప్రీంకోర్టే స్వయంగా (సుమోటోగా) జోక్యం చేసుకోవాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు కోరారు. ఆయన బుధవారం నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ‘సర్’ ప్రక్రియపై ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు లేవనెత్తిన ఆభ్యంతరాలు అనేక ప్రశ్నలు, అనుమానాలు రేకెత్తిస్తున్నాయని అన్నారు.
రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘం మీద ప్రజలకు ఎలాంటి అనుమానాలు ఉండొద్దని, అది పూర్తి నిష్పక్షపాతంగా నడువాలని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం దేశంలో అత్యున్నత రాజ్యాంగబద్ధ వ్యవస్థ అని గుర్తుచేశారు. ఇలాంటి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థపై విచారణ జరిపే సత్తా, విశ్వసనీయత ఒక సుప్రీంకోర్టుకు మాత్రమే ఉన్నదని, వేరే ఏ దర్యాప్తు సంస్థనూ నమ్మే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. గతంలో ఎన్నికల కమిషనర్లుగా పనిచేసిన పెద్దమనుషులే ప్రస్తుత పరిస్థితులపై నోరు విప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, వారి మాటలను సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. సర్వోన్నత న్యాయస్థానమే రంగంలోకి దిగి విచారణ జరిపిస్తేనే అసలు నిజాలు బయటికొస్తాయని, ప్రజల్లో ఎన్నికల సంఘంపై పోయిన నమ్మకం మళ్లీ చిగురిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
‘సర్’పై ఢిల్లీకి పోయి నిలదీసినం
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియలో పెద్ద ఎత్తున గందరగోళం, లోపాలు జరిగాయని దీనిపై నిలదీసేందుకు పార్టీ ప్రతినిధులతో కలిసి న్యూఢిల్లీకి వెళ్లి ముగ్గురు ఎన్నికల కమిషనర్లను స్వయంగా కలిసి వినతిపత్రం ఇచ్చామని కేటీఆర్ చెప్పారు. ఎన్నిసార్లు ఆధారాలతో అభ్యంతరాలు లేవనెత్తినా ఎన్నికల సంఘం నుంచి సరైన సమాధానాలు రావడం లేదని, దీంతో వారి నిష్పాక్షికతపై దేశవ్యాప్తంగా అనుమానాలు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. మన దేశ ప్రజాస్వా మ్య పునాదులు పదిలంగా ఉండాలన్నా, ఎన్నికల వ్యవస్థపై జనాలకు భరోసా దకాలన్నా సుప్రీంకోర్టు కనుసన్నల్లో సమగ్ర దర్యాప్తు జరగడమే సరైన మార్గమని తేల్చిచెప్పారు. అందుకే సర్వోన్నత న్యాయస్థానం ఈ విషయమై జోక్యం చేసుకుని ‘సర్’ నిర్వహణ సాఫీగా జరిగేలా చూడాలని కోరారు.
పోరాటాలు చేస్తేనే పనులు జరిగే పరిస్థితి
తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై స్పందించిన కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో నిరసనలు, ఆందోళనలు చేయకుండా ఏ పనీ జరగని దుస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. ప్రజలకు సహజంగా అందాల్సిన నీరు, విద్యుత్తు వంటి కనీస అవసరాల కోసం కూడా రైతులు, ప్రజలు రోడ్లెకి ఆందోళనలు చేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప అన్నట్టు తాము ప్రజాసమస్యలపై పోరాడుతునే ఉంటామని కేటీఆర్ ఉద్ఘాటించారు. రైతుల సమస్యలపై నిరసనలు తెలిపిన వారిని, తమ పార్టీ నాయకులను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయించి ఉద్యమాలను అణచివేయాలని చూసిందని కేటీఆర్ ఆరోపించారు. అయితే రైతుల ఆగ్రహం, పోరాటాల ఫలితంగానే చివరికిప్రభుత్వం దిగివచ్చి నీటిని విడుదల చేసిందని పేరొన్నారు. అక్టోబర్లో పంట కోతలు పూర్తయ్యేంత వరకు తాము రైతుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని, రైతాంగ హకుల కోసం చివరి వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అసమర్థత వల్లే విద్యుత్తు సంక్షోభం
తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న తీవ్ర విద్యుత్తు సంక్షోభానికి కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే కారణమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. 2023లో కేసీఆర్ అధికారం నుంచి దిగిపోయే నాటికి రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పాదక సామర్థ్యాన్ని 19,000 మెగావాట్లకు చేర్చి మిగులు విద్యుత్తు రాష్ట్రాన్ని అందించామని చెప్పారు. కానీ కాంగ్రెస్ వనరుల దుర్వినియోగం వల్ల నేడు వ్యవస్థ మొత్తం కుప్పకూలిందని మండిపడ్డారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బొగ్గు సంస్థ అయిన సింగరేణిని తీవ్ర సంక్షోభంలోకి నెట్టారని మండిపడ్డారు. సంస్థలో సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందని, రూ.1,600 కోట్ల కుంభకోణం జరిగిందని తాము స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలన చేసి సాక్ష్యాలు బయటపెట్టినా ప్రభుత్వం బుకాయిస్తున్నదని విమర్శించారు. బొగ్గు కొరత వల్ల రాష్ట్రంలో ఏ ఒక థర్మల్ విద్యుత్తు కేంద్రం కూడా పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదని, ఇప్పటికే ఐదు ప్రధాన విద్యుత్తు కేంద్రాలు పూర్తిగా మూతపడ్డాయని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం, బీజేపీ మౌనంపై ప్రశ్నలు
తెలంగాణలో నెలకొన్న సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి బంధువు లబ్ధి పొందేందుకు నిబంధనలు మార్చి అక్రమాలకు పాల్పడినా, రూ.1,600 కోట్ల విలువైన బొగ్గు మాయమైనా కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తున్నదని పేర్కొన్నారు. సమర్థంగా నడిచిన విద్యుత్తు వ్యవస్థను ధ్వంసం చేసినందుకు కాంగ్రెస్, అలాగే అక్రమాలపై నోరు మెదపని బీజేపీ రెండు పార్టీలూ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
రైతాంగానికి కరెంట్ కష్టాలు, ఎండిపోతున్న పంటలు
గ్రామీణ ప్రాంతాల్లో, వ్యవసాయ రంగానికి రోజుకు కేవలం ఆరు గంటలు మాత్రమే విద్యుత్తు సరఫరా చేస్తుండటంతో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని కేటీఆర్ పేరొన్నారు. కేసీఆర్ హయాంలో నిరంతరాయంగా విద్యుత్తు అందించిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అంధకారంలోకి నెట్టివేసిందని ధ్వజమెత్తారు. తాము ఏదో ఆరోపణలు చేయడం లేదని తెలంగాణలోని అన్ని సబ్స్టేషన్లలో విద్యుత్తు శాఖ అధికారులు నిర్వహిస్తున్న రికార్డ్ బుక్లే ఇందుకు ప్రత్యక్ష సాక్షమని తెలిపారు.