సమాజంలో భావితరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిది. విద్యార్థిలోని ప్రతిభను గుర్తించి భవిష్యత్తుకు బాటలు వేసేది గురువే. తల్లిదండ్రుల తర్వాత పిల్లల జీవితంపై అత్యంత ప్రభావం చూపించే వ్యక్తి ఉపాధ్యాయుడు. అందుకే మన సంస్కృతిలో గురువును దైవంతో సమానంగా కొలుస్తాం.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉపాధ్యాయుల పాత్ర చరిత్రలో నిలిచిపోయింది. సకల జనుల సమ్మె, పెన్‌డౌన్, సహాయ నిరాకరణ వంటి కార్యక్రమాల్లో పాల్గొని తమ ఉద్యోగాలు, కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలను సైతం పణంగా పెట్టి పోరాడారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యమ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రాధాన్యత లభించింది. 2015లో 10వ పీఆర్సీ 29 శాతం ఫిట్మెంట్ సిఫారసు చేయగా ప్రభుత్వం 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించింది.
2021లో తెలంగాణ తొలి పీఆర్సీ 7.5 శాతం సిఫారసు చేయగా అదనంగా 22.5 శాతం కలిపి 30 శాతం ఫిట్మెంట్ ఇచ్చింది. ‘మన ఊరుమన బడి’ ద్వారా ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇచ్చింది. కానీ నేడు పరిస్థితి ఎలా ఉన్నది? ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నమ్మి కాంగ్రెస్‌కు ఓట్లు వేసిన ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం పుస్తకాలు పట్టాల్సిన చేతులతో ప్లకార్డులు పట్టుకుని రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది. పెండింగ్‌లో ఉన్న 6 డీఏలు విడుదల చేయకపోవడం, నూతన పీఆర్సీ అమలుపై స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది.
స్వయంగా ముఖ్యమంత్రే విద్యాశాఖను తన దగ్గర పెట్టుకుని అధిక ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉన్నది. విద్యావ్యవస్థను గాడిలో పెట్టే అత్యంత కీలకమైన డీఈఓ పోస్టుల్లో మొత్తం 33 జిల్లాలకుగాను నలుగురు మాత్రమే రెగ్యులర్ అధికారులు ఉన్నారు. పర్యవేక్షణ కోసం ఉండాల్సిన డిప్యూటీ డీఈఓల పరిస్థితీ అంతే..మండల స్థాయిలో ఎంఈవోలు కూడా పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల పర్యవేక్షణ కరువై, ప్రజలకు ప్రభుత్వ విద్యావ్యవస్థ మీద నమ్మకం సన్నగిల్లుతున్నది. గురుకులాల్లో సరిపడ సిబ్బంది లేకపోవడం వల్ల టీచర్లు వార్డెన్ బాధ్యతలు నిర్వహించాల్సిన దుస్థితి దాపురించింది. గురుకులాల్లో పనిచేసే ఉపాధ్యాయులపై అదనపు పని భారం పడి ఒత్తిడితో గుండెపోటు, దీర్ఘకాల వ్యాధుల బారిన పడుతున్నారు. గెస్ట్ ఫ్యాకల్టీ పరిస్థితి కూడా అధ్వాన్నంగా తయారయ్యింది. వారికి నెలనెలా కనీసం వేతనం కూడా సరిగ్గా ఇవ్వకపోగా గొడ్డుచాకిరి చేయిస్తున్నారు. గురుకుల సిబ్బందికి కనీసం ఉద్యోగ భద్రత కూడా లేకపోవడం దారుణం.
ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గందరగోళంగా మారింది. సబ్జెక్ట్‌తో సంబంధం లేకుండా పరీక్షలు నిర్వహిస్తూ వారిని ఒత్తిడికి గురిచేస్తున్నారు. ఉద్యోగోన్నతుల్లోనూ అన్యాయం చేయడం ఆందోళన కలిగించే అంశం. ఈ తరుణంలో ఉపాధ్యాయులు తెస్తున్న ఏకీకృత సర్వీస్ విధానం మీద ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది.
ఇక రిటైర్డ్ ఉపాధ్యాయుల పరిస్థితి మరింత బాధాకరం. 3035 ఏండ్లపాటు సేవలు అందించిన తర్వాత కూడా గ్రాట్యుటీ, కమ్యుటేషన్, పీఎఫ్, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగాల్సి వస్తున్నది. ఇవి కేవలం ఆర్థిక ప్రయోజనాలు కావు, జీవితాంతం వారు చేసిన సేవలకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం అని గ్రహించాలి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు, రిటైరైన వారికి పెండింగ్ బకాయిలను కాలపరిమితిలోగా విడుదల చేయాలి. ఈహెచ్ఎస్ను కూడా పటిష్టం చేయాలి. టీచర్లు, రిటైర్డ్ టీచర్ల వేతనాల నుంచి నెలనెలా 1.5 శాతం కట్ చేస్తున్నప్పటికీ క్యాష్‌లెస్ వైద్యం, ఆసుపత్రుల ఆమోదం, మెడికల్ బిల్లుల చెల్లింపులో సమస్యలు కొనసాగుతున్నాయి. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లినప్పుడు డబ్బు కోసం ఆలోచించే పరిస్థితి లేకుండా భరోసా కల్పించాలి.
పాత పెన్షన్ విధానం కోసం ఉద్యోగుల్లో ఉన్న ఆందోళనను మానవీయకోణంలో పరిగణించి, వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలి. జీవో 317 సమస్యకు కూడా పరిష్కారం అవసరం. స్థానికత, ఉద్యోగాల కేటాయింపులు, బదిలీల కారణంగా అనేక కుటుంబాలు విడిపోయాయి. ముఖ్యంగా స్పౌజ్, పరస్పర బదిలీల వంటి మానవీయ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆయా కుటుంబాలు విడిపోకుండా పరిష్కారం చూపాలి. ఏండ్ల తరబడి ఒకే పోస్టులో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు కల్పించాలి. ఉపాధ్యాయుడి ప్రధాన బాధ్యత అయిన బోధనకు తగిన సమయం కల్పించాలి. యాప్‌లు, సర్వేలు, డిజిటల్ రిపోర్టులు, ఇతర బోధనేతర పనుల భారాన్ని తగ్గించాలి. పుస్తకం పట్టాల్సిన గురువు ప్లకార్డు పట్టుకుని రోడ్డుపై నిలబడాల్సిన పరిస్థితి రాకూడదు. ప్రభుత్వం ఇకనైనా ఉపాధ్యాయుల సమస్యలను రాజకీయ దృక్పథంతో కాకుండా మానవీయ కోణంలో చూడాలి. గురువుకు గౌరవం ఇవ్వడమంటే భవిష్యత్ తరాలకు భరోసా ఇవ్వడమేనని గ్రహించాలి.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ నాయకుడు)
-ఏనుగుల రాకేష్‌రెడ్డి