సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : నగరానికి తాగునీరందించే హిమాయత్‌సాగర్‌లో జలదోపిడీ మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతున్నది. రిజర్వాయర్ గేట్ల నుంచి వచ్చే లీకేజీ నీటిలో వందలాది మోటార్లు వేసి నీటిని తోడేస్తున్నారు. లీకేజీ నీటి గుంటల్లో మోటార్లను బిగించి హిమాయత్‌సాగర్ గ్రామంలోని పైపుల ద్వారా సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి 20 వేల లీటర్ల ట్యాంకర్లకు సరఫరా చేస్తున్నారు. ఒక్కో ట్యాంకర్‌కు రూ.10 వేల నుంచి రూ.15 వేల దాకా ధర నిర్ణయించి విక్రయిస్తున్నారు. ఈ తతంగం ఏండ్ల తరబడిగా జరుగుతున్నా అధికారుల్లో ఏమాత్రం చలనం రావడం లేదు. రిజర్వాయర్ దిగువ భాగం కావడంతో తమ పరిధి కాదని జలమండలి అధికారులు తేల్చి చెబుతున్నారు. రిజర్వాయర్ బండ్ ఏరియాలో ఉంది కాబట్టి తమ పరిధిలోకి రాదని రెవెన్యూ అధికారులు దాటవేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మూసీ ప్రాజెక్టు పరిధిలోకి వస్తుంది కాబట్టి అది ఎంఆర్డీసీఎల్ పరిధిలోకి వస్తుందని సెలవిస్తున్నారు. శాఖల మధ్య సమన్వయలోపం, ఒకరిపై మరొకరు నెపం వేసుకోవడం అక్రమార్కులకు వరంగా మారుతున్నది.

రిజర్వాయర్ గేట్ల సమీపంలోని కిస్మత్పూర్ పరిధి శ్రీసాయి నగర్లో ఈ దందా యథేచ్ఛగా సాగుతున్నది. పెద్దపెద్ద పైపుల ద్వారా రోజంతా తోడుతుండటంతో ఆ ప్రాంతమంతా ట్యాంకర్లతో కిటకిటలాడుతున్నది. కొంతమంది పైపులను ఏకంగా ఇండ్లలోకి వేసుకుని అక్కడి నుంచి ట్యాంకర్లకు విక్రయిస్తున్నారు. మరికొంత మంది వారే ట్యాంకర్లను కొనుగోలుచేసి నీటిని తోడి విక్రయిస్తున్నారు. ఈ దందా ఇప్పుడు ఆ ప్రాంతం వారికి రూ.లక్షల్లో కాసుల పంట పండిస్తున్నది. వందలాది ట్యాంకర్ల రాకపోకలతో ఆ ప్రాంతంలో తిరిగేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు.
ఈ ట్యాంకర్లను ఎక్కువ బహుళ అంతస్తుల భవనాలకు సరఫరా చేస్తుండటంతో బిల్డర్లు ధర విషయంలో రాజీ పడకుండా ఎక్కువ మొత్తం చెల్లిస్తున్నట్లు తెలుస్తున్నది. రిజర్వాయర్ నుంచి వచ్చే నీరంతా అక్రమార్కులకు వరంలాగా మారుతున్నది. దీనిపై జలమండలి అధికారులకు స్థానికులు ఇటీవల ఫిర్యాదు చేశారు. అలాగే రాజేంద్రనగర్ ఆర్డీవోకు విన్నవించారు. జలమండలి, రెవెన్యూ అధికారులు తమ పరిధి కాదంటే తమ పరిధి కాదని అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నీటిని అక్రమంగా తోడేవారి నుంచి అధికారులకు ప్రతి నెలా మామూళ్లు వెళ్తున్నాయని, అందుకే పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. అధికారులు స్పందించి అక్రమ నీటి సరఫరాను అడ్డుకోవాలని కోరుతున్నారు.