ముంబై, మార్చి 7 : ఔత్సాహిక మహిళా వ్యాపార, పారిశ్రామికవేత్తలకు తక్కువ వడ్డీరేటుకే పూచీకత్తు లేకుండా రుణాలు మంజూరు చేస్తామని శుక్రవారం ఎస్బీఐ ప్రకటించింది. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడంతో ‘అస్మిత’ పేరిట ఈ ప్రత్యేక లోన్లకు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం శ్రీకారం చుట్టింది. బ్యాంక్ చైర్మన్ సీఎస్ శెట్టి మాట్లాడుతూ.. మహిళల ఆధ్వర్యంలో నడిచే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు వేగంగా, సులభంగా ఈ రుణాలను అందజేస్తామన్నారు. ఇదిలావుంటే ‘నారీ శక్తి’ ప్లాటినమ్ రూపే డెబిట్ కార్డునూ ఎస్బీఐ ఈ సందర్భంగా తీసుకొచ్చింది.
ప్రవాస భారతీయ మహిళల కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా శుక్రవారం ‘బోవోబీ గ్లోబల్ వుమెన్ ఎన్ఆర్ఈ, ఎన్ఆర్వో సేవింగ్స్ అకౌంట్’ను అందుబాటులోకి తెచ్చింది. గృహ, వాహన రుణాలపై చౌక వడ్డీ, తక్కువ ప్రాసెసింగ్ చార్జీలు, లాకర్ అద్దెపై 100 శాతం రాయితీ, ఎయిర్‌పోర్టుల్లో ఉచితంగా దేశీయ, అంతర్జాతీయ లాంజ్ సౌకర్యం పొందేలా కస్టమైజ్డ్ డెబిట్ కార్డు వంటి ప్రయోజనాలు ఈ ఖాతాదారులకుంటాయి.