Credit Cards on UPI | ఎస్బీఐ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు జారీ సంస్థలు వచ్చే మార్చి నాటికి `యూపీఐ` సేవలు అందుబాటులోకి తేనున్నాయి. `రూపే క్రెడిట్ కార్డ్ ఆన్ యూపీఐ` ఫీచర్‌ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఫీచర్ కింద ప్రతిరోజూ రూ.50 లక్షల విలువైన లావాదేవీలు జరుగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లు యూపీఐ సేవలు అందిస్తున్నాయి. దేశంలోకెల్లా అతిపెద్ద క్రెడిట్ కార్డుల జారీ సంస్థ `హెచ్డీఎఫ్సీ బ్యాంక్` తెచ్చిన న్యూ యూపీఐ ఫీచర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తున్నది.
2023 మార్చి నెలాఖరు నాటికి ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్ కూడా ఈ సేవల్లోకి ఎంటర్ కానున్నాయి. ప్రస్తుతం ఈ మూడు బ్యాంకులు `రూపే క్రెడిట్ కార్డు`పై యూపీఐ సేవలు అందుబాటులోకి తేవడానికి టెక్నాలజీ అనుసంధాన ప్రక్రియలో ఉన్నాయని ఎన్పీసీఐ ఎండీ కం సీఈవో దిలీప్ అస్బే చెప్పారు. ప్రస్తుతం రోజువారీగా రూ.50 లక్షల విలువైన లావాదేవీలు నమోదవుతున్నాయని, మున్ముందు ఇతర అతిపెద్ద క్రెడిట్ జారీ సంస్థలు యూపీఐ సేవలను అందుబాటులోకి తెస్తే, లావాదేవీలు మరింత పెరుగుతాయన్నారు.
తమ క్రెడిట్ కార్డులను యూపీఐ సేవలతో అనుసంధాన ప్రక్రియపై స్పందించడానికి యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్పందించలేదు. గత జూన్‌లో యూపీఐ సేవలతో క్రెడిట్ కార్డులను `పే నౌ` ఫెసిలిటీ కింద లింక్ చేయడానికి ఆర్బీఐ అనుమతించిన సంగతి తెలిసిందే. దీంతో డిజిటల్ పేమెంట్స్ సేవల వినియోగానికి యూజర్లకు అదనపు వెసులుబాటు లభిస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
దేశవ్యాప్తంగా యూపీఐ పేమెంట్స్‌ను ఐదు కోట్లకు పైగా మర్చంట్లు అనుమతించగా, వారిలో సుమారు 20 నుంచి 40 లక్షల మర్చంట్లు క్రెడిట్ కార్డులను అనుమతించారు. యూపీఐ ఫీచర్‌పై `రూపే క్రెడిట్ కార్డు`ల వినియోగంతో క్రెడిట్ కార్డ్ మార్కెట్ రెండు నుంచి మూడు రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. చిన్న వ్యాపారుల వద్ద యూపీఐపై రూ.2000 వరకు రూపే క్రెడిట్ కార్డుల వినియోగంపై అదనపు చార్జీలను తొలగిస్తూ ఎన్పీసీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. యూపీఐ ఫీచర్‌తో క్రెడిట్ కార్డు పేమెంట్స్‌ను అనుమతించిన ఆర్బీఐ.. మాస్టర్ కార్డ్, వీసా వంటి ఇతర క్రెడిట్ కార్డు నెట్‌వర్క్‌లకు అనుమతించే అవకాశాలు ఉన్నాయి.