ATM Transaction With OTP | ప్రస్తుత డిజిటల్ యుగంలో దేశవ్యాప్తంగా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. వివిధ బ్యాంకుల ఏటీఎంల్లోనూ ఫ్రాడ్ జరుగుతున్నది. దీనికి దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ తన ఖాతాదారులు మోసగాళ్ల ట్రాప్‌లో పడకుండా రక్షించేందుకు మంచి సొల్యూషన్‌తో ముందుకు వచ్చింది. దీని అమలుతో ఎస్బీఐ ఏటీఎంల వద్ద సైబర్ ఫ్రాడ్స్‌ను కనీస స్థాయికి తీసుకు రావచ్చునని భావిస్తున్నది. ఖాతాదారుల ఆర్థిక అవసరాల పట్ల రక్షణ కల్పిస్తూ, వారి ఏటీఎంలతో ఇతరులు ఎటువంటి మోసాలకు పాల్పడకుండా చర్యలు చేపట్టవచ్చు.
అందుకోసం ఏటీఎంల వద్ద ప్రస్తుతం అమలులో ఉన్న నగదు విత్‌డ్రాయల్స్ స్థానే ఓటీపీ ఆధారిత క్యాష్ విత్‌డ్రాయల్ సిస్టమ్‌ను ప్రవేశపెడుతున్నది. దీనివల్ల ఏటీఎంల వద్ద ఖాతాదారులకు మెరుగైన భద్రత లభిస్తుంది. దీని ప్రకారం ఏటీఎంల వద్ద ఖాతాదారులు ఓటీపీ నమోదు చేస్తేనే క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఓటీపీ నంబర్ ధృవీకరించాకే నగదు విత్ డ్రాయల్ చేసుకోవచ్చు. ఈ అంశాన్ని శనివారం ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. గతేడాదే ఏటీఎం లావాదేవీలకు ఓటీపీ ట్రాన్సాక్షన్ విధానాన్ని ఎస్బీఐ అమలులోకి తీసుకొచ్చింది. ఖాతాదారు సంబంధిత బ్యాంకు శాఖలో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. అలా కానీ పక్షంలో ఏటీఎం నుంచి నగదు విత్ డ్రాయల్ కష్టంగా మారుతుంది.