SBI Jobs | డిగ్రీ పాసైన నిరుద్యోగులకు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) నిరుద్యోగులకు తీపి కబురందించింది. క్లర్క్లు, ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల కోసం భారీగా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా 6,160 ఖాళీల భర్తీకి ఆన్లైన్లో అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి 21వ తేదీ వరకూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా 6160 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎస్సీలకు 989, ఎస్టీలకు 514, ఓబీసీలకు 1389, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) వారికి 603, అన్ రిజర్వుడ్ కోటాలో 2,665 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలో 125 పోస్టులు, ఆంధ్రప్రదేశ్లో 390 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఎస్బీఐ తన నోటిఫికేషన్లో తెలిపింది.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం, విద్యా సంస్థ నుంచి డిగ్రీలో పాస్ అయి ఉండాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అక్టోబర్ నెలలో గానీ, నవంబర్లో గానీ ఆన్లైన్లో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆన్లైన్ పరీక్షతోపాటు స్థానిక భాష పరీక్ష, సర్టిఫికెట్ల పరిశీలన, వైద్య పరీక్షల తర్వాత అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదిపాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలంలో నెలకు రూ.15 వేల చొప్పున స్టయిఫండ్ ఇస్తారు. ఇతర అలవెన్స్లు లభించవు.
2023 ఆగస్టు ఒకటో తేదీ నాటికి అభ్యర్థులు 20 ఏండ్ల నుంచి 28 ఏండ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీల అభ్యర్థులు రూ.300 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైన అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి పూర్తిగా మినహాయింపు ఉంటుంది.