చాలామంది తమ సంపాదనను పూర్తిగా ఖర్చులకే వెచ్చిస్తుంటారు. పొదుపు, పెట్టుబడి, అత్యవసర నిధి.. ఇలా దేనికీ వీరి జీవితంలో చోటుండదు. నిజానికి వీరు బాగానే సంపాదిస్తుంటారు. సకాలంలో అన్ని బిల్లులనూ ఎంతో బాధ్యతగా చెల్లిస్తుంటారు. కాబట్టి వీరిని దుబారా చేస్తున్నారని నిందించలేం. అయినప్పటికీ నెలాఖరు వచ్చేసరికి చేతిలో చిల్లిగవ్వ మిగలదు. దీనంతటికీ ఓ ప్లానింగ్ అనేది లేకపోవడమే కారణమని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఇలాంటివారికి 70/10/10/10 ఫార్ములా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని సలహా ఇస్తున్నారు.
ఏమిటీ సూత్రం?
మీ నెలవారీ ఆదాయాన్ని 4 భాగాలుగా విభజిస్తే ఎలా ఉంటుంది? అని ఒక్కసారి ఆలోచించండి. ఆ భాగాలను 70/10/10/10గా ఎంచుకోండి. ప్రణాళికాబద్ధంగా మీ సంపాదనను వాడుకోవడమే దీని అసలు ఉద్దేశం.
70 శాతంలో..
మీ సంపాదనలో 70 శాతం.. ఇంటి అద్దె, కిరాణా సరుకుల కొనుగోళ్లు, రవాణా, బీమా ప్రీమియంలు, పిల్లల స్కూల్/కాలేజీ ఫీజులు, రోజువారీ ఖర్చులు, ఇతర బిల్లుల చెల్లింపునకు కేటాయించుకోవచ్చు.
10 శాతంలో..
10 శాతం సంపాదనను దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం పెట్టుకోవాలి. ఇదే భవిష్యత్తులో మీ సంపద సృష్టికి బాటలు వేస్తుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, రిటైర్మెంట్ అకౌంట్స్ లేదా మరే ఇతర దీర్ఘకాలిక పెట్టుబడులైనా కావచ్చు.
10 శాతంలో..
ఈ 10 శాతం స్వల్పకాలిక పెట్టుబడులకు ఉంచాలి. అనుకోకుండా వచ్చే ఖర్చులను అధిగమించడానికి ఇది దోహదం చేయగలదు. అలాగే అత్యవసర నిధిగా, లేదా ప్రయాణాలు, వైద్యం వంటి వాటికి సులువుగా ఉపయోగపడేలా ఈ పెట్టుబడులుండాలి.
10 శాతంలో..
రుణాల చెల్లింపునకు ఈ 10 శాతాన్ని కేటాయించాలి. అధిక వడ్డీ రుణాలు మీ వృద్ధిని కుంటుబడేలా చేస్తాయి. కనుక ఆ రుణ భారాన్ని తొలగించుకోవడం ముఖ్యం. అలాగే అనవసరపు ఖర్చుల జోలికి కూడా వెళ్లకపోవడం ఉత్తమం. దుబారా అనేది అసలు లక్ష్యాలనే దెబ్బతీస్తుంది.
గుర్తుంచుకోండి..
ఆర్థిక ప్రణాళిక లేకపోతే జీవితంలో లక్ష్య సాధన కష్టతరమే. ఎవరైనాసరే తమ ఆదాయంలో వ్యయ చెల్లింపులకే తొలి ప్రాధాన్యతనిస్తారు మరి. పొదుపును వాయిదా వేస్తుంటారు. అందుకే 70/10/10/10 ఫార్ములాను ప్రయత్నించండి. ఒకవేళ ఈ సూత్రంలో మీ ఖర్చులకు మీ సంపాదనలో 70 శాతం సరిపోవడం లేదంటే.. మీ ఆదాయం పెరుగాల్సిన అవసరం ఉన్నదన్నమాట. అయినప్పటికీ పొదుపు, పెట్టుబడికి 10 శాతం కాకపోయినా.. 5 శాతంతో ప్రారంభించండి. నెమ్మదిగా దాన్ని 10 శాతానికి పెంచేలా కృషి చేయండి. చిన్నచిన్న పెట్టుబడులకూ నేడు విస్తృత అవకాశాలున్నాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లనూ ప్రయత్నించవచ్చు.
సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్), ఇతర మ్యూచువల్ ఫండ్స్‌ను ప్రయత్నించండి. అలాగే ప్రతి ఒక్కరూ అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. కనీసం 6 నెలలపాటు మీకు ఆదాయం లేకపోయినా.. మీ ఖర్చులను సాఫీగా అధిగమించేలా ఆ నిధి ఉండాలన్నది మరువద్దు. క్రెడిట్ కార్డులు, రుణాల మీద అతిగా ఆధారపడవద్దు. ఆరోగ్య బీమా, జీవిత బీమాల ప్రాధాన్యతను గుర్తించి నిర్ణయాలు తీసుకోవాలి. అరకొర బీమాలతో ఒనగూరే లాభం ఏమీ ఉండదు. మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని సమగ్ర బీమా పాలసీలను కొనడం ఉత్తమం. పిల్లల పేరిట చిన్నప్పటి నుంచే సేవింగ్స్ మొదలుపెడితే ఎక్కువ లాభాలను అందుకోవచ్చు.