Sashidhar Jagdishan | హెచ్‌డీఎఫ్‌సీని విలీనం చేసుకున్న హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు తదుపరి సీఈవో కం మేనేజింగ్ డైరెక్టర్ శశిధర్ జగదీశన్ సారధ్యం వహించనున్నారు. ఈ రెండు సంస్థల విలీనానికి చట్టపరమైన అనుమతులు లభించిన తర్వాత జగదీశన్ సారధ్యం వహిస్తారు. తొలి నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏర్పాటైనప్పటి నుంచి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఆదిత్య పూరీ స్థానే బ్యాంక్ ఎండీగా శశిధర్ జగదీశన్ బాధ్యతలు చేపట్టారు.
1996లో ప్రైవేట్ బ్యాంకులో శశిధర్ జగదీశన్ చేరారు. బ్యాంకింగ్ రంగంలో 30 ఏండ్ల అనుభవం కలిగి ఉన్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. బ్యాంకులో ఫైనాన్స్ విభాగం మేనేజర్‌గా కెరీర్ ప్రారంభమైంది. మూడేండ్ల తర్వాత ఫైనాన్స్ బిజినెస్ హెడ్‌గా నియమితులయ్యారు. 9 ఏండ్ల తర్వాత బ్యాంక్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు.
ఆయన పనితీరుకు గుర్తింపుగా 2013-14లో బెస్ట్ సీఎఫ్‌వో అవార్డు అందుకున్నారు శశిధర్ జగదీశన్. ముంబై వాసి శశిధర్ జగదీశన్.. ముంబై యూనివర్సిటీలో సైన్స్ (ఫిజిక్స్)లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. అటుపై చార్టర్డ్ అకౌంటెంట్‌గా క్వాలిఫై అయ్యారు. బ్రిటన్‌లోని యూనివర్సిటీ షెఫీల్డ్‌లో మనీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లో మాస్టర్ పట్టా అందుకున్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో చేరడానికి ముందు ముంబైలో డచెస్ బ్యాంక్ ఏజీలో మూడేండ్లు పని చేశారు.