అమెరికా టీకాలకూ మన ముడిసరుకే

- ఫైజర్, మోడర్నా తయారీలోనూ హైదరాబాద్ కంపెనీ
- ఎంఆర్ఎన్ఏ టీకాల తయారీకి ‘సపాల’ ముడిపదార్థాలు
- వన్స్ మోర్.. అన్ని వ్యాక్సిన్లకు అడ్డాగా మన భాగ్యనగరం
వ్యాక్సిన్ ఏదైనా, తయారు చేసే కంపెనీ ఏ దేశానిదైనా.. సాంకేతికత ఎవరిదైనా, సరఫరా చేసేది ఎవరైనా.. అందులో హైదరాబాద్ పాత్ర ఉండాల్సిందే. అవును! కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లే కాదు.. అమెరికా, యూరప్ తయారుచేసుకొన్న ఫైజర్, మోడర్నా టీకాలకూ మన కంపెనీలు సహాయం చేస్తున్నాయి. ఈ రెండు వ్యాక్సిన్లకు అవసరమయ్యే ముడిసరుకును భాగ్యనగరానికి చెందిన సపాల ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అందజేస్తున్నది.
హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): కొవాగ్జిన్ ఉత్పత్తి ఎక్కడ.. హైదరాబాద్. కొవిషీల్డ్ ఉత్పత్తి ఎక్కడ.. హైదరాబాద్. స్పుత్నిక్-వీ ఉత్పత్తి ఎక్కడ.. హైదరాబాద్. ఇతర రోగాల వ్యాక్సిన్ల తయారీ ఎక్కడ.. హైదరాబాద్. ప్రపంచదేశాలకు వేదికగా మారిన మన రాజధాని.. ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్ల తయారీలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నది. ఈ రెండు.. మెసెంజర్ ఆర్ఎన్ఏ(ఎంఆర్ఎన్ఏ) ఆధారిత వ్యాక్సిన్లు. వీటికి అవసరమయ్యే ముడి సరుకును హైదరాబాద్‌కు చెందిన సపాల ఆర్గానిక్స్ కంపెనీ సరఫరా చేస్తున్నది. మనదేశంలో పంపిణీ చేస్తున్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లు ఇనాక్టివేటెడ్ వైరస్ నుంచి అభివృద్ధి చేసినవి. దీనికి భిన్నంగా ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ ఉంటుంది. దీని ఆధారంగా తయారైనవే ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్లు.
సపాల ప్రత్యేకతేంటి?
ప్రపంచంలో అతికొద్ది సంస్థల వద్ద మాత్రమే ఈ సాంకేతికత ఉన్నది. మనదేశంలో ఇప్పటికీ ఈ సాంకేతికతపై పెద్దగా పరిశోధనలు జరుగుతున్న దాఖలాలు లేవు. ప్రతిష్ఠాత్మక ఐఐసీటీ హైదరాబాద్, ఎన్సీఏ-పుణెలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ పైడి ఎల్లారెడ్డి జపాన్ కంపెనీతో కలిసి సపాల ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను 2005లో హైదరాబాద్‌లో స్థాపించారు. అప్పటి నుంచి ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీపై కృషిచేసి ఫలితాలు సాధించారు. ప్రభావవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కంపెనీ అభివృద్ధి చేసింది. దీని ఆధారంగా పర్సనలైజ్డ్ మెడిసిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొవిడ్ కష్టకాలంలో ఎంఆర్ఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ల అభివృద్ధి జరగటం, పెద్దమొత్తంలో ఉత్పత్తి అవసరమైన నేపథ్యంలో సపాల అందుకు అవసరమైన ముడిసరుకును సరఫరా చేసేందుకు ఓకే చెప్పింది. జనవరి 2020 నుంచి ఎంఆర్ఎన్ఏ(ఫైజర్, మోడర్నా) వ్యాక్సిన్లకు అవసరమయ్యే ముడిసరుకును ఎగుమతి చేస్తున్నది.
ఏంటా ముడిసరుకు
ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఉత్పత్తిలో ఉపయోగించే సూడోరిడైన్, ఎన్1 మీథైల్ సూడోరిడైన్, క్యాప్ రీఏజెంట్స్ని గ్లోబల్ సీఎంవో ద్వారా సపాల కంపెనీ అమెరికాకు సరఫరా చేస్తున్నది. శరీరంలో క్రియాశీలక వైరస్ అణచివేతను ప్రోత్సహించటానికి అవసరమయ్యే మ్యుటేషన్‌ను రూపొందించడానికి ఇవి ఉపయోగపడతాయి. తక్కువ విషపూరిత ఎంఆర్ఎన్ఏను ఉత్పత్తి చేయడానికి క్యాప్ రీఏజెంట్స్ ఉపయోగపడతాయి. ప్రధాన ముడిసరుకును జపాన్ నుంచి దిగుమతి చేసుకొని మార్పులు చేసి, తుదిరూపాన్ని అమెరికా, యూరప్ దేశాలకు సరఫరా చేస్తున్నదీ కంపెనీ. ఇతర చికిత్సల్లో ఉపయోగించే న్యూక్లియోసైడ్స్, ఆర్గానిక్ కాంపౌండ్ల సమ్మేళనాలను రూపొందించటంలోనూ సపాలకు నైపుణ్యం ఉన్నది. కొవిడ్-19, ఇతర వైరస్‌లను గుర్తించే డయాగ్నస్టిక్ కిట్స్ తయారీకి అవసరమైన ప్రోబ్స్, ప్రైమర్స్ను సంశ్లేషణ కోసం ఉపయోగించే డీఎన్టీపీల తయారీ సాంకేతికతను అభివృద్ధి చేసింది.
హైదరాబాద్‌లో మరో యూనిట్
కీసర సమీపంలో మరో కొత్త తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ హై-వాల్యూ కాంపౌండ్స్, ఒలిగోన్యూక్లియోటైడ్స్ల ఉత్పత్తి జరుగుతుంది. తద్వారా మా అదనపు అవసరాల సామర్థ్యాన్ని అందిపుచ్చుకోగలుగుతాం. ఈ ప్లాంట్ కోసం ఇప్పటికే దాదాపు 6.5 ఎకరాల స్థలాన్ని సేకరించాం. తొలి దశలో భాగంగా సుమారు రూ.60 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలున్నాయి. వచ్చే నెల నుంచే పనులు మొదలుపెట్టాలని భావిస్తున్నాం. 18 నెలల్లో ఈ యూనిట్ పూర్తిస్థాయి ఉత్పత్తిని అందుకునే వీలున్నది.
–డాక్టర్ పైడి ఎల్లారెడ్డి, ప్రెసిడెంట్/ సీఈవో, సపాల ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్
మన దగ్గరా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు!
మనదేశంలో ఇప్పటివరకు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల తయారీ దిశగా పెద్దగా పరిశోధనలు జరగలేదు. ఈ క్రమంలో సీసీఎంబీ, ఐఐఎస్ఈఆర్-మొహాలీతో సపాల జతకట్టింది. అవసరమైన ముడిసరుకు సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నది. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధి జరిగితే మనదేశంలోనూ ఫైజర్, మోడర్నా వంటి టీకాలు అందుబాటులోకి రానున్నాయి. సీసీఎంబీ దాదాపు 4 నెలల నుంచి దీనిపై కృషి చేస్తున్నది. 5, 6 నెలల్లో ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్టు సీసీఎంబీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. సహాయం అందిస్తామని సపాల కంపెనీ చెప్పటంతోనే తాము ముందడుగు వేసినట్టు సీసీఎంబీలోని అటల్ ఇన్నోవేషన్ సెంటర్ సీఈవో ఎన్ మధుసూదన్‌రావు తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జర్నలిస్టు శంకర్‌కు 14 రోజుల రిమాండ్.. న్యూస్‌లైన్ ఎండీపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ జోడించిన పోలీసులు
ఇందిరమ్మ చీరలకు బిల్లుల గండం.. పెండింగ్‌లో రూ.120 కోట్ల బకాయి
జ్ఞానేశ్ ను ఎవరూ కాపాడలేరు.. వేలాదిమందితో ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన
భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

