భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమవుతున్నదని సచివాలయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. దీపావళి నాటికి కీలక శాఖల అధిపతులు (హెచ్ వోడీలు), రెండేండ్లకుపైగా ఒకే జిల్లాలో పనిచేస్తున్న కలెక్టర్లను మార్చే అవకాశాలున్నాయని తెలుస్తున్నది.
- అభియోగాలు ఉన్న హెచ్వోడీలు, ఒకే జిల్లాలో రెండేండ్లు దాటిన కలెక్టర్ల మార్పునకు కసరత్తు
- అధికారుల పనితీరుపై సీఎం అసహనం
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమవుతున్నదని సచివాలయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. దీపావళి నాటికి కీలక శాఖల అధిపతులు (హెచ్ వోడీలు), రెండేండ్లకుపైగా ఒకే జిల్లాలో పనిచేస్తున్న కలెక్టర్లను మార్చే అవకాశాలున్నాయని తెలుస్తున్నది. కేవలం సర్వీస్ కాలాన్ని ప్రాతిపదికగా తీసుకోకుండా, అధికారుల పనితీరు, అభియోగాలు, ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల అమలు, పెండింగ్ ఫైళ్లు, ప్రజా సమస్యల పరిషారం, శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని సమాచారం. ఇప్పటికే అధికారుల నుంచి స్వీయ పనితీరు నివేదికలు, వివిధ శాఖల పనితీరుపై అంతర్గత నివేదికలు తెప్పించినట్టు తెలిసింది. వీటి ఆధారంగానే బదిలీలు జరుగుతాయని చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొంతమంది జిల్లా కలెక్టర్ల పనితీరు, హెచ్‌వోడీల మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సీఎంవో నుంచి లీకులు వదులుతున్నారు.
పనితీరుపై సీఎం అసహనం
పరిపాలనలో ఆశించిన వేగం కనిపించకపోవడం, కీలక నిర్ణయాలు పెండింగ్‌లో ఉండటం, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో పర్యవేక్షణ లోపించడం తదితర అంశాల పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల అధికారులపై అసహనం వ్యక్తంచేసినట్టు తెలుస్తున్నది. ఈ నెలలో విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా అంశంపై అధికారులకు సీఎం తీవ్ర హెచ్చరికలు చేసినట్టు తెలిసింది. యాదాద్రి సహా థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల్లో పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి జరిగేలా చూడాలన్న ఆదేశాల అమల్లో అధికారుల నిర్లక్ష్యాన్ని సీఎం తీవ్రంగా పరిగణించినట్టు సమాచారం. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌మిట్టల్, జెన్కో సీఎండీ ఎస్ హరీశ్‌కు హెచ్చరికలు చేసినట్టు వార్తలు వచ్చాయి. అధికారుల పనితీరులో నిర్లక్ష్యం కొనసాగితే సస్పెన్షన్లకూ వెనుకాడబోనని సీఎం హెచ్చరించినట్టు ప్రచారం జరుగుతున్నది. అధికారుల పనితీరుపై కేవలం మౌఖిక అభిప్రాయాలకే పరిమితం కాకుండా, వారి స్వీయ అంచనాలు, శాఖల పురోగతిపై నివేదికలు, ప్రభుత్వ లక్ష్యాల సాధనలో చూపిన చొరవ, ప్రజా ఫిర్యాదుల పరిషారం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నట్టు చెప్తున్నారు. ప్రధాన కార్యదర్శి స్థాయిలో అధికారుల పనితీరు వివరాలు సేకరించి, ముఖ్యమంత్రి కార్యాలయానికి అందుబాటులో ఉన్న నివేదికలతో సరిపోల్చుతున్నట్టు సచివాలయ వర్గాలు చెప్తున్నాయి.
రెండేండ్లు దాటిన కలెక్టర్లపై దృష్టి
ఈసారి భారీగా జిల్లా కలెక్టర్ల బదిలీలు ఉంటాయని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు మంత్రుల మాట మినహా తమ మాట వినడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఒక జిల్లా కలెక్టర్ స్థానిక మంత్రినైనా తనను కూడా లెక్కచేయడం లేదని ఒక మంత్రి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్టు చెప్తున్నారు. బదిలీల్లో సదరు కలెక్టర్‌ను ఇక్కడి నుంచి పంపించాలని సదరు మంత్రి పట్టుపడుతున్నట్టు తెలిసింది. సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట కలెక్టర్లను బదిలీ చేస్తారని ప్రచారం జరుగుతున్నది. ఒకే జిల్లాలో రెండేండ్లకుపైగా పనిచేస్తున్న కలెక్టర్ల మార్పు ఈ కసరత్తులో ప్రధాన అంశంగా కనిపిస్తున్నది. ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా, జగిత్యాల కలెక్టర్ బీ సత్యప్రసాద్, కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, వరంగల్ కలెక్టర్ సత్యశారద, జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్‌శర్మ, వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి, రంగారెడ్డి కలెక్టర్ సీ నారాయణరెడ్డి రెండేండ్లపాటు అక్కడే కొనసాగిన నేపథ్యంలో వారిని బదిలీ చేసే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు.
హెచ్‌వోడీల మార్పులపై కసరత్తు
జిల్లా కలెక్టర్లతోపాటు కీలక శాఖల్లో పూర్తిస్థాయి అధిపతుల నియామకంపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తున్నది. పరిశ్రమలు, ఐటీ, వాణిజ్యం వంటి శాఖలకు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులపై పనిభారం తగ్గించడం, ఖాళీలను భర్తీ చేయడం, శాఖల మధ్య సమన్వయం పెంచడం లక్ష్యంగా మార్పులు ఉండవచ్చని సమాచారం. ప్రస్తుతం ఒకటి కంటే ఎకువ శాఖల బాధ్యతలు చూస్తున్న ఉన్నతాధికారులకు బదులుగా పూర్తిస్థాయి కార్యదర్శులను నియమించే అంశాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. కీలక ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పరిశ్రమల అనుమతులు, సంక్షేమ పథకాల అమలు వేగవంతం కావాలంటే సంబంధిత శాఖల్లో నిర్ణయాధికారం స్పష్టంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నదని అధికారవర్గాల్లో చర్చ జరుగుతున్నది.
నిషేధిత ఆస్తుల జాబితా (22-ఏ) నిర్వహణ, ప్రభుత్వ భూముల రక్షణ అంశాలు కూడా అధికారుల పనితీరు సమీక్షలో ప్రాధాన్యత పొందవచ్చని తెలుస్తున్నది. 22-ఏ భూముల వ్యవహారంలో పర్యవేక్షణ తీరుపై ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసంతృప్తిగా ఉన్నారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో సీసీఎల్ఏలో భారీ మార్పులు జరుగుతాయని ప్రచారం జరుగుతున్నది. ప్రభుత్వ శాఖల్లో నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం, కోర్టు ఆదేశాల అమల్లో నిర్లక్ష్యం కూడా ఉన్నతాధికారుల పనితీరుపై చర్చకు కారణమవుతున్నదని తెలుసున్నది. భూసేకరణ పరిహారం చెల్లింపులో జాప్యంపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఆర్అండ్బీ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్పై హైకోర్టు గతంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అనంతరం చెల్లింపులు జరిగినట్టు గుర్తించి ఆ ధికరణ విచారణను ముగించింది. తాజా బదిలీల్లో వీళ్లందరికీ బదిలీలు తప్పవని చెప్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

