న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: మొబైల్, స్మార్ట్గాడ్జెట్ ఉత్పత్తుల విక్రయాల్లో అగ్రగామి సంస్థ సంగీత మొబైల్స్ తన పంతాను మార్చుకుంటున్నది. ఈ-కామర్స్ సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి వినూత్న సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొబైల్‌ను బుకింగ్ చేసుకున్న 30 నిమిషాల్లోనే ఇంటికి డెలివరీ చేసే విధంగా ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతానికి ఈ వినూత్న సేవలు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల్లో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సంగీత మొబైల్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుభాష్ చంద్ర తెలిపారు.
ఈ మొబైల్ డెలివరీ సేవలను త్వరలో ముంబై, నోయిడాలో అందిస్తున్నట్లు, తర్వాతి క్రమంలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు చెప్పారు. మెట్రో నగరాలతోపాటు చిన్న స్థాయి పట్టణాల్లో కూడా బుకింగ్ చేసుకున్నవారికి డెలివరి చేయనున్నట్లు తెలిపారు. స్టోర్లలో లభించనున్న అన్ని ఆఫర్లు ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వారికి కూడా వర్తించనున్నాయన్నారు. మరోవైపు, బెంగళూరులో ఫ్లాగ్షిప్ స్టోర్‌ను సైతం త్వరలో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ స్టోర్‌లో కృత్రిమ మేధస్సు టెక్నాలజీతో రూపొందించిన అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలు లభించనున్నాయన్నారు.