Rupee Slumps | ఫారెక్స్ మార్కెట్లో మన రూపాయి మరింత బక్కచిక్కింది. గురువారం ట్రేడింగ్‌లో డాలర్‌పై 10 పైసలు నష్టపోయి 77.72 వద్దకు పడిపోయింది. అమెరికాలో మాంద్యం సంకేతాలు.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం.. పెరిగిపోతున్న ధరల భయం ప్రపంచవ్యాప్త స్టాక్ మార్కెట్లతోపాటు దేశీయ స్టాక్ మార్కెట్లను వెంటాడింది.
దేశీయ మార్కెట్లలో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలహీన పడింది. విదేశీ ఇన్వెస్టర్ల వాటాల విక్రయం యధాతథంగా సాగింది. ఫలితంగా డాలర్‌పై రూపాయి మరింత చిక్కిపోయింది. డాలర్‌పై రూపాయి మారకం విలువ కనిష్ఠ స్థాయికి పడిపోవడం ఆల్‌టైం రికార్డు.
ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో గురువారం ట్రేడింగ్‌లో 77.72 వద్ద ప్రారంభమైంది. గత సెషన్‌తో పోలిస్తే 10 పైసలు నష్టపోయి 77.72 వద్దే ముగిసింది. ఇంట్రా డే ట్రేడింగ్‌లో 77.76-77.63 మధ్య తచ్చాడింది.
డాలర్ ఇండెక్స్ కూడా 0.28 శాతం నష్టంతో 103.51 వద్ద సాగింది. బ్రెంట్ క్రూడాయిల్ ధర 1.87 శాతం తగ్గి బ్యారెల్‌పై 107.07 డాలర్లు పలికింది. రూపాయి బుధవారం 18 పైసలు నష్టపోయి 77.62 వద్ద ముగిసింది.