Rupee value : అమెరికన్ డాలర్ (US dallor) తో పోలిస్తే ఇండియన్ రూపీ (Indian rupee) బుధవారం నాటి ట్రేడింగ్లో భారీగా లాభపడింది. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు పునఃప్రారంభం కానుండటంతో మార్కెట్లో సానుకూల వాతావరణం ఏర్పడింది. అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడటం కూడా రూపాయికి కలిసొచ్చింది. దాంతో రూపాయి మారకం విలువ గత రెండు వారాల్లో తొలిసారి 88 మార్కు కంటే దిగువకు చేరింది. ఇవాళ ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి 0.23 పైసలు బలపడి 87.82 వద్ద కొనసాగింది.
క్రితం రోజు ట్రేడింగ్లో రూపాయి 0.7 పైసలు లాభపడి 88.09 వద్ద ముగిసింది. ఈ రోజు అంతకంటే మెరుగైన ప్రదర్శన కనబరిచింది. కాగా రూపాయి బలపడటానికి అంతర్జాతీయ పరిణామాలు కూడా తోడయ్యాయి. అమెరికా ఆర్థికవ్యవస్థ మాంద్యం అంచున ఉందని వస్తున్న వార్తలతో డాలర్ ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడికి గురైంది. ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ప్రధాన ఆర్థికవేత్త మార్క్ జాండీ ఇదే విషయాన్ని స్పష్టంచేశారు. అమెరికాలో ఉద్యోగాలు, ఉత్పాదకత, వ్యయాలకు సంబంధించిన డేటాను బట్టిచూస్తే ఆ దేశం మాంద్యం ముంగిట ఉందని జాండీ చెప్పారు.
దాంతో సానుకూల పరిణామాలు ఉన్నప్పటికీ ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకోబోయే నిర్ణయం కోసం మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల ప్రవాహంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
కాగా విశ్లేషకుల అంచనా ప్రకారం.. రూపాయికి 88.20 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఒకవేళ రూపాయి 87.90 స్థాయిని దాటి బలపడితే.. 87.50 లేదా 87.20 స్థాయులకు కూడా చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు డాలర్ ఇండెక్స్ 0.11 శాతం పెరిగి 96.73 వద్ద ఉండగా.. బ్రెంట్ ముడిచమురు ఫ్యూచర్స్ ట్రేడ్లో 0.20 శాతం తగ్గి బ్యారెల్కు 68.33 డాలర్ల వద్ద కొనసాగుతున్నది.