ముంబై, డిసెంబర్ 24: డాలర్ దెబ్బకు రూపాయి ఏమాత్రం నిలబడలేకపోతున్నది. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా కరెన్సీతో పోల్చితే భారతీయ కరెన్సీ మారకం విలువ మళ్లీ ఆల్‌టైమ్ కనిష్ఠానికి దిగజారింది మరి. మంగళవారం మరో 4 పైసలు పడిపోవడంతో మునుపెన్నడూ లేనివిధంగా 85.15 వద్దకు చేరింది. దీంతో ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్‌లో గత 4 రోజులుగా రూపీ 85పైనే ఉంటున్నైట్టెంది. గత గురువారం తొలిసారి 85 మార్కును దాటిన విషయం తెలిసిందే. సోమవారం కూడా 7 పైసలు నష్టపోగా.. ఈ రెండు రోజుల్లో 11 పైసలు కోల్పోయింది.
పతనం వెనుక..
డిసెంబర్ నెల ముగుస్తుండటంతో దేశీయ మార్కెట్లోని దిగుమతిదారులపై చెల్లింపుల ఒత్తిడి ఉంటుందని, ఈ క్రమంలోనే డాలర్లకు పెరుగుతున్న డిమాండ్.. రూపీని మరింత బలహీనపరుస్తున్నదని ఫారెక్స్ ట్రేడర్లు చెప్తున్నారు. పైగా జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రాబోతున్నారు. దీంతో మళ్లీ సుంకాల సమరం మొదలవుతుందన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఫలితంగా డాలర్ల కోసం భారతీయ దిగుమతిదారులు ఎగబడిపోతున్నారు. కాగా, ఫెడ్ రిజర్వ్ కఠిన ద్రవ్య వైఖరి దిశగా వెళ్తుండటం కూడా రూపీ కష్టాల్ని పెంచిందన్న అభిప్రాయాలూ ఉన్నాయి. ఇక దేశీయ మార్కెట్ల నుంచి ఆగని విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహరణలు సైతం పరిస్థితుల్ని ఇంకా దిగజార్చుతున్నాయి. మొత్తానికి రూపాయి పతనం.. దేశీయ దిగుమతుల్ని ఖరీదెక్కిస్తుండగా, ద్రవ్యోల్బణం, ద్రవ్య పరపతి, చివరకు దేశ ఆర్థిక వ్యవస్థల్నే ప్రమాదంలోకి నెడుతున్నది.
నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు
క్రిస్మస్ సందర్భంగా బుధవారం స్టాక్, ఫారెక్స్, కమోడిటీ మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ 4 రోజులకు పరిమితమైంది. ఇదిలా ఉంటే మంగళవారం సెన్సెక్స్ 67, నిఫ్టీ 26 పాయింట్లు క్షీణించాయి.