ముంబై, నవంబర్ 29 : డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ శుక్రవారం ఆల్‌టైమ్ కనిష్ఠానికి దిగజారింది. ఈ ఒక్కరోజే 13 పైసలు పడిపోయి మునుపెన్నడూ లేనివిధంగా భారతీయ కరెన్సీ 84.60 వద్దకు క్షీణించింది. దేశ జీడీపీ వృద్ధిరేటు దాదాపు రెండేండ్ల కనిష్ఠానికి పతనం కావడం.. విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను అదేపనిగా ఉపసంహరించుకుంటుండటం ఓవరాల్ సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని ఫారెక్స్ మార్కెట్ ట్రేడర్లు తాజా సరళిని విశ్లేషిస్తున్నారు. దీనికితోడు దేశంలోని దిగుమతిదారుల నుంచి డాలర్లకు పెరిగిన డిమాండ్ కూడా రూపీని బలహీనపర్చిందని చెప్తున్నారు. నిజానికి ఇటీవలికాలంలో డాలర్ ముందు రూపీ వెలవెలబోతూనే ఉన్నది. ఒక్కరోజే 10 పైసలకుపైగా క్షీణించిన సందర్భాలు అనేకం ఉన్నాయంటే కరెన్సీ మార్కెట్లో రూపాయి ఎదుర్కొంటున్న ఒత్తిడిని అర్థం చేసుకోవచ్చు. రూపాయి విలువ ఇలాగే పడిపోతే ఆ ప్రభావం.. ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు, జీడీపీలపై గట్టిగానే పడవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారీ నష్టాల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం కోలుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 759.05 పాయింట్లు లేదా 0.96 శాతం ఎగిసి 79,802.79 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 880.16 పాయింట్లు పెరగడం గమనార్హం. ఇక ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ కూడా 216.95 పాయింట్లు లేదా 0.91 శాతం ఎగబాకి 24వేల స్థాయికి ఎగువన 24,131.10 వద్ద నిలిచింది. భారతీ ఎయిర్టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. రంగాలవారీగా హెల్త్‌కేర్, టెలీకమ్యూనికేషన్స్, ఎనర్జీ, టెక్నాలజీ షేర్లు రాణించాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ 0.76 శాతం, మిడ్‌క్యాప్ 0.31 శాతం మేర పుంజుకున్నాయి. గురువారం సెన్సెక్స్ 1,190, నిఫ్టీ 361 పాయింట్లు నష్టపోయిన విషయం తెలిసిందే.