ముంబై, డిసెంబర్ 2 : డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తొలిసారి 90 స్థాయికి పతనమైంది. గతకొద్ది రోజులుగా అమెరికన్ కరెన్సీ ముందు వెలవెలబోతున్న భారతీయ రూపీ.. మంగళవారం మరో చారిత్రక కనిష్ఠానికి పడిపోయింది. ఉదయం ఆరంభం నుంచే నేలచూపులు చూస్తున్న దేశీయ కరెన్సీ.. సమయం గడుస్తున్నకొద్దీ బలహీనపడుతూనే ఉన్నది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో 89.70 వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఈ క్రమంలోనే ఒకానొక దశ (ఇంట్రా-డే)లో మునుపెన్నడూ లేనివిధంగా 90 మార్కును తాకింది. చివరకు 4 పైసలు కోలుకుని రూపాయి చరిత్రలోనే ఆల్‌టైమ్ లో 89.96 వద్ద స్థిరపడింది. సోమవారం ముగింపుతో చూస్తే 43 పైసలు నష్టపోయింది. క్రితం రోజు 89.53 వద్ద స్థిరపడిన విషయం తెలిసిందే.
గతకొద్ది నెలలుగా డాలర్లకు దిగుమతిదారుల నుంచి డిమాండ్ అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. తాజా ట్రేడింగ్‌లోనూ ఇది స్పష్టంగా కనిపించింది. ఈ క్రమంలోనే రూపాయిపై విపరీతంగా ఒత్తిడి పడుతున్నది. గత నెల 21న ఒక్కరోజే 98 పైసలు రూపాయి విలువ దిగజారడం గమనార్హం. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జోక్యం కూడా కొంతమేర తగ్గడం.. ఫారెక్స్ మార్కెట్లో దేశీయ కరెన్సీని కోలుకోకుండా చేస్తున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మోదీ హయాంలో డాలర్‌తో చూస్తే రూపాయి మారకం విలువ ఏకంగా 31.33 పైసలు క్షీణించింది. గడిచిన పదకొండున్నరేండ్లలో ఏటేటా రూపీ బక్కచిక్కిపోతూనే ఉండటం గమనార్హం. కేంద్రంలో మోదీ సర్కారు కొలువుదీరినప్పుడు డాలర్‌తో చూస్తే రూపాయి మారకపు విలువ 58.63 వద్ద ఉన్నది. కానీ ఇప్పుడు అది 89.96 వద్దకు దిగజారింది. నిజానికి పడిపోతున్న రూపాయి విలువ.. దేశ ఆర్థిక వ్యవస్థను గట్టిగానే ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా దిగుమతులు భారం అవుతాయి. దేశీయ చమురు అవసరాల్లో 80 శాతానికిపైగా దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. దీంతో పెరిగే ముడి చమురు ధరలు.. దేశంలో రవాణా ఖర్చులను ఎగదోస్తాయి. దీనివల్ల ప్రతీ వస్తూత్పత్తి ధర పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. తద్వారా ఆర్బీఐ కఠిన ద్రవ్యవిధానాలను అనుసరించాల్సి వస్తుంది. ఫలితంగా రుణ లభ్యత తగ్గి, నిరుద్యోగం, పేదరికం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
యూపీఏ ప్రభుత్వం అసమర్థత వల్లనే రూపాయి విలువ పతనమైందని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ‘దేశం నేడు నిరాశ చెందింది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ లేదా పడిపోతున్న రూపాయి గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కుర్చీని కాపాడుకోవడమే అక్కడి పెద్దల పనైపోయింది’ అని నాడు మోదీ విమర్శలు గుప్పించారు.
