ముంబై, మార్చి 9: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ సోమవారం ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి పతనమైంది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ వద్ద 39 పైసలు పడిపోయి 92.21 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 92.35 వద్దకు దిగజారినప్పటికీ మళ్లీ కోలుకున్నది. మిడిల్ ఈస్ట్‌లో ముదురుతున్న సంక్షోభం.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్ని ఎగదోస్తున్నది.
దీంతో డాలర్లకు దిగుమతిదారుల నుంచి డిమాండ్ అంతకంతకూ పెరుగుతున్నది. ఇదే దేశీయ కరెన్సీ నష్టాలకు దారితీస్తున్నదని ఫారెక్స్ ట్రేడర్లు తాజా సరళిని విశ్లేషిస్తున్నారు. కాగా, వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణం భయాలు సైతం ప్రభావం చూపాయని.. స్టాక్ మార్కెట్ల క్షీణత, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణలు కూడా రూపాయిని ఒత్తిడికి గురిచేసినట్టు చెప్తున్నారు. శుక్రవారం 18 పైసలు తగ్గినది తెలిసిందే.
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో ముడి చమురు, గ్యాస్ సరఫరాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రూపాయి విలువ పతనం.. దేశంలోకి దిగుమతుల్ని మరింత భారం చేస్తున్నది. రూపాయి విలువ పడిపోతున్నకొద్దీ మరిన్ని డాలర్లు ఎక్కువగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. దీంతో ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలకు రూపీ ప్రభావం కారణంగా పెరిగే ధరలూ తోడవుతున్నాయి. దీనివల్ల దేశీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరిగే వీలున్నది.