ముంబై, మే 11: దేశీయ కరెన్సీకి మరిన్ని చిల్లులు పడ్డాయి. అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో అమెరికా కరెన్సీకి అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో రూపాయి విలువ చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై శాంతి ప్రతిపాదనపై ఇరాన్ ఇచ్చిన సమాధాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించడంతో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకోనుండటం ఫారెక్స్ మార్కెట్లో అలజడికి కారణమైంది. వీటికి తోడు క్రూడాయిల్ భగ్గుమనడం రూపాయిని మరింత పాతరేసింది. ఫారెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 79 పైసలు నష్టపోయి 95.28కి జారుకున్నది.
రూపాయి చరిత్రలో ఇంతటి స్థాయికి పతనమవడం ఇదే తొలిసారి. పసిడి కొనుగోళ్లు నిలిపివేయాలని, కఠిన పొదుపు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ సూచన మార్కెట్లో సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా భారీగా నిధులను ఉపసంహరించుకోవడం రూపాయి పతనానికి ఆజ్యంపోసిందని ఫారెక్స్ ట్రేడర్ వెల్లడించారు. 94.97 వద్ద ప్రారంభమైన డాలర్-రూపీ ఎక్సేంజ్ రేటు 94.87 నుంచి 95.34 మధ్యస్థాయిలో కదలాడింది. చివరకు శుక్రవారం ముగింపుతో పోలిస్తే 79 పైసలు కోల్పోయి 95.28 వద్ద నిలిచింది.