హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై గోద్రెజ్ కన్నేసింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్బీ)కు చెందిన 7.8 ఎకరాల భూమిని ఈ-వేలం ద్వారా విక్రయించగా, రూ.547 కోట్లకు సదరు సంస్థ కొన్నది మరి. ఎకరం రూ.70 కోట్లు పలకడం విశేషం. హౌజింగ్ బోర్డు బుధవారం చేపట్టిన వేలంలో గోద్రేజ్ ప్రాపర్టీస్తోపాటు అరబిందో రియల్టీ, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, అశోక బిల్డర్ వంటి ప్రముఖ నిర్మాణ రంగ సంస్థలు పోటీపడ్డాయి. ఈ క్రమంలోనే ఒక్కో ఎకరం రూ.70 కోట్లకు గోద్రెజ్ సంస్థ కొనుగోలు చేసింది.
హైటెక్ సిటీకి సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పటికే అనేక సంస్థలకు చెందిన బహుళ అంతస్థుల భవనాలున్నాయి. ఈ లావాదేవీతో త్వరలో గోద్రెజ్ ఆధ్వర్యంలోనూ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇక్కడ రానున్నది. కాగా, ఈ భూముల వేలానికి హౌసింగ్ బోర్డు గత నెలలోనే నోటిఫికేషన్ ఇచ్చింది. ఎకరాకు రూ.40 కోట్లను కనీస ధరగా నిర్ణయించింది. దీంతో గోద్రెజ్ అత్యధిక ధరతో బిడ్ దాఖలు చేసినట్టు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతం తెలిపారు.