Rs 500 Notes | ఇటీవల దేశంలో ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.500 నోట్లను వెనక్కి తీసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇదే అంశంపై రాజ్యసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి కీలక వివరాలు వెల్లడించారు. రూ.500 నోట్లను రద్దు చేసే ఆలోచన ఏమీ లేదని తెలిపారు. రూ.100, రూ.200తో పాటు రూ.500 నోట్లు ఏటీఎంలలో అందుబాటులో ఉంటాయన్నారు. ఏటీఎంల ద్వారా రూ.100, రూ.200 నోట్ల డినామినేషన్‌కు సంబంధించి ఇటీవల (Distribution of Rs 100 and Rs 200 denomination banknotes through ATMs) పేరుతో ఏప్రిల్ 28న సర్క్యులర్ జారీ చేసినట్లుగా ఆర్బీఐ ప్రభుత్వానికి తెలిపిందని తెలిపారు. దీని కింద అన్ని బ్యాంకులు, వైట్ టేబుల్ ఏటీఎం ఆపరేటర్స్ తమ ఏటీఎంలలో రూ.100, రూ.200 డినామినేషన్ న ఓట్లను క్రమం తప్పకుండా అందుబాటులో ఉంచాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆర్బీఐ నిర్దేశించిన లక్ష్యం ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి అన్ని ఏటీఎంలలో 75శాతం రూ.100 లేదంటే రూ.200 డినామినేషన్ బ్యాంక్ నోట్స్ కనీసం ఒక క్యాసెట్ అందుబాటులో ఉంచుతాయన్నారు. 2026 మార్చి 31 నాటికి 90శాతం ఏటీఎంలలో రూ.100, రూ.200 డినామినేషన్ నోట్స్ క్యాసెట్ కనీసం డిస్ట్రిబ్యూట్ చేస్తాయన్నారు. మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఏప్రిల్ 2020 నుంచి మార్చి 2025 వరకు.. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో 76 కేసులను గుర్తించిందని.. వాటి నుంచి సెబీకి రూ.949.43కోట్లు రీఫండ్ (జరిమానా)గా అందిందని పేర్కొన్నారు. గత ఐదు సంవత్సరాలలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) తొమ్మిది కేసులను గుర్తించిందని, ప్రధానంగా మల్టీ-లెవల్ మార్కెటింగ్ (MLM) స్కామ్‌లకు సంబంధించినవి చెప్పారు. జనవరి 1, 2020 నుంచి జూలై 30, 2025 వరకు పెట్టుబడి మోసానికి సంబంధించిన మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 (PMLA) నిబంధనల ప్రకారం మనీలాండరింగ్ కింద ఈడీ 220 కేసులను విచారిస్తుందని చెప్పారు.