Investers Wealth | ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో ఈక్విటీ మార్కెట్లు ఊగిసలాటలోనే సాగాయి. ఈ నెలలోనూ దేశీయ స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతున్నది. ఒకవైపు ఆకాశాన్నంటే స్థాయిలో పెరుగుతున్న వస్తువుల ధరలు.. వాటిని కట్టడి చేయడానికి భారతీయ రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లు పెంచడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలహీన పడింది. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా 1.8 శాతం నష్టాలతో ముగిశాయి. ఇన్వెస్టర్లు రూ.3.2 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. వారాంతంలో సెన్సెక్స్ 1017 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 284 పాయింట్ల నష్టంతో 16,193 పాయింట్ల వద్ద స్థిర పడింది.
ధరల పెరుగుదల భయంతో అమెరికా మార్కెట్లు నష్టపోగా, ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్ల పెంపు విషయంలో దూకుడుగా ఉండటం ఇన్వెస్టర్లను కలరవ పరిచింది. పదేండ్ల తర్వాత వచ్చే నెలలో 25 బేసిక్ పాయింట్లు కీలక వడ్డీరేట్లు పెంచుతామని యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) ప్రకటించింది. చైనా ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ 6.4 శాతం, ద్రవ్యోల్బణం 2.1 శాతంగా నమోదయ్యాయి.చైనాలో బిజినెస్ హబ్ షాంఘై మళ్లీ లాక్డౌన్లోకి వెళ్లడం బలహీన సంకేతాలిచ్చింది.
భారత్‌లో దేశవ్యాప్తంగా కొవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కేసులు పెరగడంతో కరోనా ఆంక్షలు అమలులోకి వస్తే ఆర్థిక వ్యవస్థ రికవరీ దెబ్బ తింటుందన్న భయాలు ఉన్నాయి. మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 120 డాలర్ల మార్క్‌పైనే కొనసాగుతున్నది. రూపాయి బలహీన పడటంతో కరంట్ ఖాతా లోటు పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్‌పై 122 డాలర్లు పలుకుతున్నది. శుక్రవారం ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో డాలర్‌పై రూపాయి 77.82 లకు పడిపోవడం కూడా స్టాక్ మార్కెట్ల పతనానికి కారణంగా భావిస్తున్నారు.