GST | న్యూఢిల్లీ, మే 31: రాష్ర్టాలకు కేంద్ర ప్రభుత్వం రూ.86,912 కోట్ల జీఎస్టీ పరిహారాన్ని విడుదల చేసింది. దీంతో ఇప్పటిదాకా రాష్ర్టాలకున్న జీఎస్టీ బకాయిలను మొత్తం ఇచ్చేసినైట్టెందని మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా, రూ.25,000 కోట్లను జీఎస్టీ పరిహార నిధి నుంచి ఇచ్చిన కేంద్రం.. మిగతా రూ.61,912 కోట్లను పెండింగ్ సెస్ కలెక్షన్ల నుంచి ఇచ్చింది.
ఇక ఈ చెల్లింపుల్లో ఏప్రిల్, మే నెల బకాయిలకుగాను రూ.17,973 కోట్లు, ఫిబ్రవరి-మార్చికిగాను రూ.21,322 కోట్లు, జనవరి వరకున్న బకాయిలకు సంబంధించిన రూ.47,617 కోట్లున్నాయి. ఈ మొత్తం నిధుల్లో తెలంగాణకు రూ.296 కోట్లు వచ్చాయి.
పలు కేంద్ర, రాష్ట్ర పన్నులను ఏకం చేస్తూ 2017 జూలై 1న దేశవ్యాప్తంగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను మోదీ సర్కారు అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఐదేండ్లపాటు రాష్ర్టాలకు వాటిల్లే నష్టాలకు పరిహారం చెల్లిస్తామనీ చెప్పింది.