న్యూఢిల్లీ, ఆగస్టు 30 : ద్విచక్ర వాహనాలపై ఒకే తరహా జీఎస్టీని విధించాలని లగ్జరీ బైకుల సంస్థ రాయల్ ఎన్ఫిల్డ్ కోరుతున్నది. జీఎస్టీ హేతబద్దికరణలో భాగంగా అన్ని రకాల ద్విచక్ర వాహనాలపై 18 శాతం పన్నును విధించాలని సూచించింది. ప్రస్తుతం చిన్న స్థాయి బైకులపై 18 శాతం జీఎస్టీ విధిస్తుండగా, ప్రీమియం బైకులపై 28 శాతం జీఎస్టీతోపాటు పరిహారం సెస్‌ను 1 శాతం నుంచి 22 శాతం లోపు విధిస్తున్నారు.
దీంతో ప్రీమియం బైకుల ధరలు అధికంగా ఉండటంతో కస్టమర్లు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదని, దీంతో కేంద్ర సర్కార్ జోక్యం చేసుకొని ఈ బైకులపై ఒకే తరహా జీఎస్టీని విధించాలని ఐచర్ మోటర్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సిద్ధార్థ లాల్ తెలిపారు. 350 సీసీ కంటే తక్కువ సామర్థ్యం కలిగిన బైకులపై తక్కువ జీఎస్టీని విధంచడంతో ఈ తరహా బైకులకు డిమాండ్ నెలకొంటుందని ఆశిస్తున్నట్టు, అలాగే ఆపై సామర్థ్యం కలిగిన బైకులపై అధికంగా వసూలు చేస్తే ఈ రంగ బైకుల విక్రయాలు పడిపోయే ప్రమాదం ఉందన్నారు.