ఒకప్పటితో పోల్చితే పెట్టుబడులపట్ల ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి పెరుగుతున్నది. అవకాశాలను అందిపుచ్చుకుంటూ అన్నింటా మదుపు చేయాలనే చూస్తున్నారు. అందుకు తగ్గట్టే స్టాక్ మార్కెట్లు, రుణ మార్కెట్లు, గోల్డ్, రియల్టీ ఇలా ఎన్నో వేదికలున్నాయిప్పుడు. వీటికి తగ్గట్టుగా మన పెట్టుబడులను వ్యూహాత్మకంగా కేటాయించడమే పోర్ట్‌ఫోలియో అల్లోకేషన్. మరి స్మార్ట్ ఇన్వెస్టర్ల కోసం ఉన్న ఈ 5 పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్సింగ్ రూల్స్‌ను ఒక్కసారి పరిశీలిద్దామా.
కనీసం ఏడాదికోసారైనా లేదా మార్కెట్లను ప్రభావితం చేసే పరిణామాలు చోటుచేసుకున్న తర్వాతైనా మదుపరులు తప్పక తమ పోర్ట్‌ఫోలియోను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. మార్కెట్ లాభాలు లేదా నష్టాలు.. ఆస్తుల పరిమాణాన్ని మార్చగలవు. దీంతో మనం ఏ లక్ష్యాన్ని ఉద్దేశించి ఆ పెట్టుబడులను కేటాయించామో దాన్నుంచి పోర్ట్‌ఫోలియో దూరం కాగలదు. అందుకే రెగ్యులర్ రిఫ్యూ అవసరం.
రకరకాల తరగతులకు చెందిన ఆస్తులు.. వేర్వేరు రిటర్నులను మదుపరులకు అందించగలవు. ఇలాంటప్పుడే రీబ్యాలెన్స్ కీలకంగా మారుతుంది. ఉదాహరణకు స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో నడిస్తే.. పోర్ట్‌ఫోలియో వాటాలు ఆశించిన స్థాయిలను మించి పెరుగగలవు. దీంతో రిస్క్ కూడా పెరుగుతుంది. అప్పుడు షేర్ల రీబ్యాలెన్స్ ఈ ముప్పును తగ్గిస్తుంది.
మదుపరులు తాము పెట్టిన పెట్టుబడుల విలువ పెరిగితే వాటిని అమ్మేసి లాభాలను స్వీకరించాలి. అలాగే కొత్త పెట్టుబడులను పెట్టాలనుకున్నప్పుడు తక్కువ ధరల్లో కొనుగోలుకే ప్రాధాన్యత ఇవ్వాలి.
పెట్టుబడులకున్న అనేక మార్గాలను మదుపరులు ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండాలి. అప్పుడే నూతన పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. వివిధ రంగాలతోపాటు పన్ను మినహాయింపులకు వీలున్న ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ప్రయత్నిస్తే లాభదాయకం.
మన ఆర్థిక లక్ష్యాలు లేదా పరిస్థితులు మారినప్పుడు వాటికి అనుగుణంగా పోర్ట్‌ఫోలియో కేటాయింపు కూడా మారాలి. ఉదాహరణకు మదుపరులు రిటైర్మెంట్కు లేదా ప్రధాన లక్ష్యానికి దగ్గరైనప్పుడు రిస్క్ తక్కువగా ఉండాల్సిన అవసరం ఉన్నది. దీంతో ఈ మేరకు పోర్ట్‌ఫోలియో కేటాయింపులో మార్పులు తెలివైన నిర్ణయం. అప్పుడే మన అవసరాలకు సరిపోయేలా రాబడులను పొందే వీలుంటుందని మరువద్దు.
ఏ దేశానికైనా విదేశీ పెట్టుబడులు అత్యంత కీలకం. మూలధనం, ఉద్యోగాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పాదకతను పెంచుకోవడంలో ఇవి ఎంతగానో దోహదపడుతాయి. విదేశీ మారకం నిల్వలు పెరిగేందుకూ కృషి చేస్తాయి. ఇటీవలికాలంలో భారత ప్రభుత్వం కూడా ఆయా రంగాల్లో విదేశీ పెట్టుబడుల పరిమితిని పెంచుతూపోతున్న విషయం తెలిసిందే. మరి అలాంటి విదేశీ పెట్టుబడుల్లో ప్రధానంగా ఉండేవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇతర దేశాల్లోని ఆర్థికపరమైన ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టే వ్యక్తులు లేదా సంస్థల్ని ఎఫ్‌పీఐలుగా పిలుస్తారు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు, ఈటీఎఫ్‌లు, ప్రభుత్వ సెక్యూరిటీలు వంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్మెంట్ చట్టం (ఫెమా) కింద భారతీయ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డు (సెబీ) ఎఫ్‌పీఐలను నియంత్రిస్తుంది. అయితే పెట్టుబడులు పెట్టినా.. ఎఫ్‌పీఐలకు కంపెనీలు, వాటి మేనేజ్మెంట్లపై ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండవు. అయినప్పటికీ భారతీయ క్యాపిటల్ మార్కెట్లలో ఎఫ్‌పీఐల పాత్ర చాలాకాలం నుంచే కీలకంగా ఉంటున్నది.
సంస్థాగత పెట్టుబడిదారులనే ఎఫ్ఐఐలుగా చూస్తారు. విదేశాల్లోని మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్, బీమా సంస్థలు, సావరిన్ వెల్త్ ఫండ్స్, విదేశీ కేంద్ర బ్యాంకులు మొదలైనవన్నీ కూడా ఎఫ్ఐఐలే. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఈ సంస్థలు పెట్టుబడులు పెడుతాయి. మన దేశంలో ఎఫ్ఐఐలపై సెబీ నియంత్రణ ఉంటుంది. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది.
మౌలిక రంగం, పరిశ్రమలు, వ్యాపారాలు, ఇతర ప్రాజెక్టుల్లోకి నిర్ణీత పరిమితి మేరకు విదేశీ సంస్థల ద్వారా ప్రత్యక్షంగా వచ్చే పెట్టుబడులనే ఎఫ్డీఐలుగా పరిగణిస్తారు. ఇవి సాధారణంగా దీర్ఘకాలిక పెట్టుబడులు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఈ సంస్థలకూ అధికారం ఉంటుంది. ఫెమా కింద ఆర్బీఐ పర్యవేక్షణలో ఈ పెట్టుబడులుంటాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన డీపీఐఐటీ వీటిని నియంత్రిస్తుంది. నిబంధనలకు లోబడి అనుమతిస్తుంది.
ప్రైవేట్ కంపెనీల్లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) సదుపాయాన్ని అందుకొనే ఉద్యోగులకు ఐదేండ్లు పనిచేసి సంస్థను వదిలి వెళ్లిపోతున్నప్పుడు గ్రాట్యుటీ పొందే వీలున్నది. అయితే ఈ గ్రాట్యుటీ ఎంత వస్తుంది? దాని లెక్క ఏమిటి? అన్నది చాలా తక్కువ మందికే తెలుసు. నిజానికి ఐదేండ్లలోపే సర్వీసు ఉన్నప్పటికీ ఏదైనా ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై అంగవైకల్యం ఏర్పడ్డా, లేదా చనిపోయినా గ్రాట్యుటీకి అర్హులే. ఇక ఈ గ్రాట్యుటీ లెక్కింపు విషయానికొస్తే.. ఉదాహరణకు ఓ కంపెనీలో పనిచేస్తున్న సంతోష్‌కు అక్కడ ఎనిమిదేండ్ల అనుభవం ఉన్నది. ఆయన నెలవారీ వేతనంలో బేసిక్, డీఏ కలిపి రూ.30,000గా ఉన్నది. అప్పుడు గ్రాట్యుటీ రూ.1,38,461 వస్తుంది. ఇందుకు వర్తించే లెక్క ఏమిటంటే? కంపెనీలో సంతోష్‌కున్న అనుభవం (8 ఏండ్లు)తో బేసిక్, డీఏ (రూ.30,000) మొత్తాన్ని గుణించాలి.

ఆ వచ్చిన మొత్తం (రూ.2,40,000)ను 15(పరిగణనలోకి తీసుకొనే పనిదినాలు)/26(పని దినాలు) ఫార్ములాతో మళ్లీ గుణించాలి. అప్పుడు రూ.1,38,461 వస్తుంది. ఇదే ఎనిమిదేండ్ల కాలానికిగాను సంతోష్‌కు వచ్చే గ్రాట్యుటీ మొత్తం. ఇలా ఎన్నేండ్లు పనిచేస్తే అన్నేండ్లు, అప్పటి వారి బేసిక్ పే, డీఏలతో కలిసి గుణించి, ఆ మొత్తాన్ని 15/26తో మళ్లీ గుణిస్తే గ్రాట్యుటీ వచ్చేస్తుంది. ఉద్యోగి రాజీనామా చేసి వెళ్లిపోయేటప్పుడు కంపెనీలు ఈ లెక్కనే పాటించి చెల్లిస్తాయి. ఒకవేళ మీరు 12 ఏండ్ల 6 నెలలు లేదా 13 ఏండ్ల 6 నెలలు పనిచేస్తే అప్పుడు అక్కడ మీ అనుభవాన్ని 13 లేదా 14 ఏండ్లుగా పరిగణనలోకి తీసుకుంటారు. గ్రాట్యుటీ రూ.10 లక్షలు దాటితే ఎక్స్‌గ్రేషియాగా పిలుస్తూ చెల్లిస్తారు.