న్యూఢిల్లీ, మే 9: పాలసీదారులకున్న ఆందోళనల్లో పెరుగుతున్న జీవిత బీమా ప్రీమియం మొత్తాలే ప్రధానమైనవని ఓ సర్వేలో తేలింది. జీవిత బీమా కొనుగోలు నిర్ణయాన్ని ముఖ్యంగా మూడు అంశాలు ప్రభావితం చేస్తున్నట్టు మంగళవారం విడుదలైన ఈ సర్వే నివేదిక పేర్కొన్నది. అవసరాలు, ఆర్థిక పరిమితులు, స్థోమతల ఆధారంగా జీవిత బీమాపై పాలసీదారులు ఓ నిర్ణయానికి వస్తున్నట్టు హన్సా రిసెర్చ్ తెలిపింది. దేశవ్యాప్తంగా దాదాపు 3,300 మంది జీవిత బీమా పాలసీదారుల అభిప్రాయాలను సేకరించి ఈ నివేదికను హన్సా తయారు చేసింది.
కాగా, ఏ సంస్థలోనైతే బీమాను తీసుకున్నామో.. ఆ కంపెనీ సహకరించకపోవడం వల్ల కూడా పాలసీలను కొనసాగించలేకపోతున్నట్టు 22 శాతం మంది చెప్పడం గమనార్హం. ఇక ప్రతీ 10 మంది పాలసీదారుల్లో 8 మంది కనీసం 6 నెలలకోసారైనా బీమాను కొన్న తర్వాత తమ ఏజెంట్‌ను కలుసుకోవాలని కోరుకుంటున్నారు. డిజిటల్, ఆన్లైన్ విధానాలపై పాలసీదారుల్లో ఉన్న అవగాహన రాహిత్యం కూడా జీవిత బీమా కొనుగోళ్లలో ప్రధాన అడ్డంకిగా మారుతున్నది. మొత్తానికి బీమా పాలసీల ప్రీమియంలు అందుబాటు ధరల్లో ఉండాలని మెజారిటీ ప్రజానీకం కోరుకుంటున్నట్టు తాజా సర్వే స్పష్టం చేసింది.
జీవిత బీమా పాలసీలపై తీసుకున్న రుణాల చెల్లింపులను క్రెడిట్ కార్డుల ద్వారా చేయడాన్ని ఐఆర్డీఏఐ నిషేధించడంపట్ల బీమా కంపెనీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల పాలసీదారులు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉంటారని అభిప్రాయపడ్డాయి. బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ ఇటీవల.. బీమా పాలసీలపై తీసుకున్న రుణాలకు సంబంధించి పాలసీదారులు క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లిస్తే అంగీకరించవద్దని ఆదేశించిన విషయం తెలిసిందే.