Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. శుక్రవారం ఉదయం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య సాగాయి. వ్యక్తిగత రుణాలు, బ్యాంకింగ్ లావాదేవీలపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ సంస్థల షేర్లు భారీగా నష్టపోయాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సహా టాప్ స్టాక్స్ 3.6 శాతం వరకూ నష్టపోయాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కూడా పతనం అయ్యాయి.
బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 187.75 పాయింట్లు నష్టపోయి 65,794.73 పాయింట్ల వద్ద స్థిర పడింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 33.40 పాయింట్ల పతనంతో 19731.80 పాయింట్ల వద్ద మగిసింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.27 శాతం, స్మాల్ క్యాప్ 0.36 శాతం లబ్ధి పొందాయి. ఉదయం 65,788.79 పాయింట్ల వద్ద నష్టాలతో మొదలైన సెన్సెక్స్.. అంతర్గత ట్రేడింగ్‌లో 66,037.69 పాయింట్ల గరిష్ట స్థాయికి దూసుకెళ్లింది. 65,639.74 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 65,794.73 పాయింట్ల వద్ద ముగిసింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ 19674.75 పాయింట్ల వద్ద మొదలై అంతర్గత ట్రేడింగ్‌లో 19,806-19667.45 పాయింట్ల మధ్య తచ్చాడింది. చివరకు ట్రేడింగ్ ముగిసే సమయానికి 19,731.80 పాయింట్ల వద్ద నిలిచింది. స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసే సమయానికి ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.83.27 వద్ద స్థిర పడింది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 2.4 శాతం, నిఫ్టీ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్‌లు ఒక శాతానికి పైగా నష్టంతో ముగిశాయి. కేవలం నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ మాత్రమే ఒక శాతం పుంజుకున్నది.