Uber Bus | ప్రముఖ క్యాబ్ సర్వీసుల సంస్థ ‘ఉబెర్’.. దేశంలో త్వరలో బస్సు సేవలు అందుబాటులోకి తేనున్నది. తొలుత దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ‘ఉబెర్ బస్సు’ సేవలు ప్రారంభించనున్నది. ఈ మేరకు ఢిల్లీ ప్రీమియం బస్సు స్కీం కింద బస్సు సర్వీసులు నడిపేందుకు ఢిల్లీ రవాణాశాఖ నుంచి లైసెన్సు పొందింది. బస్సు సర్వీసుల లైసెన్స్ అందుకున్న తొలి క్యాబ్ సర్వీస్ సంస్థ ఉబెర్ కాగా, మొదట ఈ తరహా లైసెన్స్ జారీ చేసిన ఘనతను ఢిల్లీ రవాణాశాఖ పొందింది.
ఢిల్లీ-ఎన్సీఆర్ తోపాటు కోల్‌కతాలోనూ ప్రయోగాత్మకంగా బస్సు సేవలు అందిస్తామని ఉబెర్ షటిల్ ఇండియా అధిపతి అమిత్ దేశ్ పాండే తెలిపారు. ఢిల్లీలో బస్సు సర్వీసులకు డిమాండ్ ఉందని గమనించామన్నారు. ఇప్పుడు అధికారికంగా సేవలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు వారం ముందే బస్సు సర్వీసులను బుక్ చేసుకోవచ్చు. బస్సు వచ్చే సమయం, బస్సు లైవ్ లొకేషన్, బస్సు రూట్లను ఉబెర్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.