Inflation | న్యూఢిల్లీ, జూలై 12: ద్రవ్యోల్బణం దడ పుట్టిస్తున్నది. గత నెల రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు 4 నెలల గరిష్ఠాన్ని తాకాయి. శుక్రవారం విడుదలైన కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం జూన్‌లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 5.08 శాతంగా నమోదైంది. ఫిబ్రవరిలో 5.09 శాతంగా ఉండగా.. మళ్లీ ఇప్పుడే ఆ స్థాయి దరిదాపుల్లో గణాంకాలున్నాయి. అంతకుముందు మేలో 12 నెలల కనిష్ఠాన్ని సూచిస్తూ 4.80 శాతంగా ఉండటం గమనార్హం. కానీ ఈసారి అది మరింత పెరిగింది. ఇక గత ఏడాది జూన్‌లో 4.87 శాతంగా ఉన్నట్టు ఎన్ఎస్వో తెలియజేసింది.
ఆర్బీఐపై ఒత్తిళ్లు
అధిక ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు ఫలించడం లేదు. నిరుడు ఫిబ్రవరి తర్వాతి నుంచి కీలక వడ్డీరేట్లు యథాతథంగానే ఉంటున్న విషయం తెలిసిందే. జూన్‌లో జరిపిన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలోనూ రెపోరేటును 6.50 శాతంగానే ఉంచింది. వాస్తవానికి వివిధ రంగాలు, వ్యాపార-పారిశ్రామిక వర్గాల నుంచి వడ్డీరేట్లను తగ్గించాలన్న డిమాండ్లు వస్తున్నా.. ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా వాటిని ఆర్బీఐ పక్కనపెడుతున్నది. అయితే వచ్చే నెల జరిగే ద్రవ్యసమీక్షలోనైనా వడ్డీరేట్లు తగ్గుతాయన్న ఆశలపై తాజా ద్రవ్యోల్బణ గణాంకాలు నీళ్లు చల్లాయి. ఇంకొంతకాలం ఆర్బీఐ కఠిన ద్రవ్య విధానాన్నే అనుసరించవచ్చన్న అంచనాలున్నాయి మరి. ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ సంకేతాలనూ ఇచ్చారు. ఆగస్టు 6-8 తేదీల్లో ఆర్బీఐ ద్రవ్యసమీక్ష ఉన్న సంగతి విదితమే. అలాగే ఆర్బీఐకి 4 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినది తెలిసిందే.
ఐఐపీ 5.90 శాతం
దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) ఈ ఏడాది మే నెలలో 5.90 శాతంగా నమోదైంది. ఇది 7 నెలల గరిష్ఠం. గత ఏడాది అక్టోబర్‌లో ఐఐపీ 11.9 శాతంగా నమోదైంది. మళ్లీ ఆ తర్వాత ఇప్పుడే ఆ స్థాయి దరిదాపుల్లో గణాంకాలున్నాయి. కాగా, విద్యుత్తు, గనుల రంగాల్లో ఉత్పాదకత పెరుగడం కలిసొచ్చిందని కేంద్ర గణాంకాలు, కార్యాచరణ అమలు మంత్రిత్వ శాఖ తెలిపింది. నిరుడు మే నెలతో పోల్చితే విద్యుత్తు రంగం వృద్ధిరేటు 13.7 శాతానికి, గనుల రంగం వృద్ధి 6.6 శాతానికి పెరిగాయి. కీలకమైన తయారీ రంగం మాత్రం 6.3 శాతం నుంచి 4.6 శాతానికి దిగజారింది. ఇదిలావుంటే ఈ ఏడాది జనవరిలో 4.20 శాతంగా ఉన్న ఐఐపీ.. ఫిబ్రవరిలో 5.60 శాతం, మార్చిలో 5.40 శాతం, ఏప్రిల్‌లో 5 శాతంగా ఉన్నది. నిరుడు నవంబర్, డిసెంబర్లలో 2.50 శాతం, 4.40 శాతంగా ఉన్నాయి. ఇక నిరుడు మే నెలలో 5.70 శాతంగా ఐఐపీ ఉన్నట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి.
శాంతించని ఆహార ధరలు
ఆహార ద్రవ్యోల్బణం ఎంతకీ శాంతించడం లేదు. వరుసగా 8వ నెల కూడా 8 శాతంపైనే నమోదైంది. జూన్లోనైతే 9.36 శాతానికి చేరడం ఆందోళన కలిగిస్తున్నది. మే నెలలో ఇది 8.69 శాతంగా ఉన్నది. కూరగాయలు, పప్పుధాన్యాల ధరలు రెండంకెల స్థాయిల్లోనే కదలాడుతున్నాయి. వరుసగా 29.3 శాతం, 16.1 శాతంగా ఉన్నాయి. కూరగాయల రేట్లు 10 శాతానికిపైగా ఉండటం వరుసగా ఇది 8వ నెల. పప్పుధాన్యాలైతే 13వ నెల కావడం గమనించదగ్గ అంశం. ఓ వైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఈసారి సాగుబడిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. పంటల దిగుబడులు ఆశించిన స్థాయిలో వచ్చేలా కనిపించడం లేదు. దీంతో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక మార్కెట్లలో ఆయా ఆహారోత్పత్తుల రేట్లు రోజుకింత పెరుగుతూపోతూనే ఉన్నాయి. ఉత్తర భారతంలో వానలు దంచికొడుతున్నా.. దక్షిణాదిలో మాత్రం చినుకు రాలడం లేదు.