Retail Inflation | గత నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గింది. కొన్ని వంటింటి వస్తువుల ధరలు తగ్గడంతో మే నెల రిటైల్ ద్రవ్యోల్బణం 4.75 శాతంగా నమోదైందని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఇది ఏడాది కనిష్ట స్థాయికి సమానం. 2023 మేలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.31 శాతంగా నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్ రిటైల్ ద్రవ్యోల్బణం 4.83 శాతంగా ఉంది.గత ఫిబ్రవరి నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతోంది. ఫిబ్రవరిలో 5.1 శాతంగా నమోదైన రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్ నాటికి 4.8 శాతానికి చేరుకున్న సంగతి తెలిసిందే. గత నెలలో ఆహార ద్రవ్యోల్బణం 8.69 శాతంగా రికార్డైంది. ఏప్రిల్ ఆహార ద్రవ్యోల్బణం 8.70 శాతంగా ఉంది.
కీలక వడ్డీరేట్లను తగ్గించాలంటే ద్రవ్యోల్బణం 4-6 శాతం మధ్య ఉండాలని ఆర్బీఐ భావిస్తున్నది. ఇటీవల ముగిసిన ద్వైమార్షిక ద్రవ్య పరపతి సమీక్ష సమావేశంలో అంతర్జాతీయ అనిశ్చితి.. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేస్తుందని ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగో శాతం వరకూ దిగి వస్తే బ్యాంకుల్లో వడ్డీరేట్ల తగ్గింపు విషయమై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకోనున్నది.