RBI Shakti Kanta Das | ద్రవ్యోల్బణానికి, వృద్ధిరేటుకు మధ్య సమతుల్యత పునరుద్ధరించడం అత్యంత ముఖ్యమైన అంశం అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. సుమారు గత నాలుగేండ్లలో కూరగాయల ధరలు అత్యంత వేగంగా పెరగడంతో గత అక్టోబర్ నెల ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ట స్థాయి 6.21 శాతానికి పెరిగిందన్నారు. మంగళవారం ఆర్బీఐ గవర్నర్‌గా పదవీ విరమణ చేస్తున్న శక్తికాంత దాస్ మీడియాతో మాట్లాడారు. సైబర్ మోసగాళ్ల బెదిరింపులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కొత్త టెక్నాలజీల వినియోగంపై దృష్టిని కేంద్రీకరించాలని చెప్పారు. అపార అనుభవం గల సంజయ్ మల్హోత్రా.. ఆర్బీఐ గవర్నర్ గా సీబీడీసీ, యూఎల్ఐ వంటి సంస్థలను సమర్ధవంతంగా నడుపగలరని ఆశాభావం వయక్తం చేశారు. ఆర్బీఐ గవర్నర్‌గా నియమితులైన సంజయ్ మల్హోత్రా గురించి ప్రస్తావించడంతోపాటు ప్రస్తుతం ఆర్బీఐ ముందు ఉన్న సవాళ్లను గుర్తు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ బృందానికి శక్తికాంత దాస్ కృతజ్ఞతలు తెలిపారు.
‘ఆర్బీఐ గవర్నర్‌గా ఈ రోజు పదవీ విరమణ చేస్తున్నా. ఇప్పటి వరకూ నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఆర్బీఐ గవర్నర్‌గా పని చేస్తూ దేశానికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు. ఆయన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం మరువలేనిది. ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు హృదయ పూర్వక ధన్యవాదాలు.. ఆర్థికశాఖ, ఆర్బీఐ మధ్య గత ఆరేండ్లుగా అత్యుత్తమ సమన్వయం నెలకొంది’ అని అన్నారు.