న్యూఢిల్లీ, జూన్ 2: రానున్న నెలల్లో రిజర్వ్‌బ్యాంక్ కేవలం వడ్డీ రేట్ల పెంపుపైనే దృష్టి పెడుతుందని, వచ్చే నాలుగు మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశాల్లో కనీసం 100 బేసిస్ పాయింట్ల (1 శాతం) రేట్ల పెంపు ఉంటుందని రాయిటర్స్ పోల్‌లో ఆర్థిక వేత్తలు అంచనాల్ని వెల్లడించారు. ద్రవ్యోల్బణం ఒత్తిడులను అదుపుచేసే క్రమంలో మే 4న హఠాత్తుగా రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచిన ఎంపీసీ జూన్ 8న మరో 25 నుంచి 75 బేసిస్ పాయింట్ల వరకూ అధికం చేయవచ్చని పోల్‌లో పాల్గొన్న ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ ఎంపీసీ సమావేశం జూన్ 6-8 తేదీల మధ్య జరగనున్నది. ఇప్పటికే రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ జూన్ సమావేశాల్లో రేట్ల పెంపు ఉంటుందని సంకేతాలిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఎంత ఉంటుందన్న అంశంపై భిన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. ఆ అంచనాలివి…
5.75 శాతానికి రెపో రేటు: యాక్సిస్ బ్యాంక్
ద్రవ్యోల్బణం గరిష్ఠస్థాయిలోనే కొనసాగనున్నందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి రెపో రేటు 5.75 శాతానికి పెరగవచ్చని యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ సౌగత భట్టాచార్య చెప్పారు. ద్రవ్యోల్బణం, వృద్ధి రేటు తదితర వివిధ గణాంకాల ఆధారంగా రేట్ల పెంపు జరుగుతుందని, ప్రపంచ ఆర్థికాభివృద్ధి లేదా ఎగుమతుల వృద్ధి వేగంగా ఉంటే ఈ క్యాలండర్ సంవత్సరాంతానికే ఆర్బీఐ వడ్డీ రేటు 6 శాతానికి పెరగవచ్చని, అలాగే ద్రవ్యోల్బణం 7 శాతంపైనే కొనసాగితే త్వరితంగా రెపో రేటు పెంపుదల ఉంటుందని ఆయన వివరించారు.