RBI | ముంబై, డిసెంబర్ 5: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తమ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాన్ని శుక్రవారం ప్రకటించబోతున్నది. అయితే ఈసారి కూడా కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి రెపో రేటును గరిష్ఠ స్థాయిలోనే సెంట్రల్ బ్యాంక్ ఉంచుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోమారు ఈ రేట్ల జోలికి వెళ్లకుండానే ద్రవ్యసమీక్షను ఆర్బీఐ ముగించవచ్చన్న అభిప్రాయాలు అటు బ్యాంకింగ్, ఇటు ఆర్థిక నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. రిటైల్, హోల్‌సేల్ ద్రవ్యోల్బణాలు బాగా పెరుగడమే ఇందుకు కారణం.
అక్టోబర్‌లో ఏకంగా వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 6.21 శాతానికి చేరిన సంగతి విదితమే. కాగా, మిశ్రమ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని తగ్గించే వీలుందన్న అంచనాలున్నాయి. ఇదే జరిగితే బ్యాంకులకు నిధుల లభ్యత పెరుగుతుంది. ఫలితంగా ఆయా రంగాలకు చౌకగా రుణాలు లభిస్తాయి. వడ్డీరేట్లను తగ్గించకుండా ఈ రకంగా మార్కెట్‌కు ఊరటనివ్వాలని ఆర్బీఐ చూస్తున్నదని చెప్తున్నారు.
రిజర్వు బ్యాంక్ క్రమంగా బంగారం నిల్వలను పెంచుకుంటున్నది. అక్టోబర్ నెలలో సెంట్రల్ బ్యాంకులు 60 టన్నుల గోల్డ్‌ను కొనుగోలు చేయగా, దీంట్లో రిజర్వుబ్యాంక్ అత్యధికంగా 27 టన్నుల గోల్డ్‌ను కొనుగోలు చేసినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజాగా వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు మొత్తంగా 77 టన్నుల గోల్డ్ కొనుగోలు చేయగా, దీంట్లో సెంట్రల్ బ్యాంక్ 27 టన్నులు కొనుగోలు చేసినట్లు ఐఎంఎఫ్ విడుదల చేసిన నివేదిక ఆధారంగా డబ్ల్యూజీసీ ఈ విషయాన్ని వెల్లడించింది.