RBI | పది రూపాయల నాణేలు చెల్లవని చాలా రోజులుగా ఓ ప్రచారం జరుగుతోంది. ఇది నమ్మి కొంతమంది వ్యాపారులు, దుకాణదారులు నాణేలను స్వీకరించడం లేదు. రూ.10 నాణేలు చెల్లుతాయని గతంలోనే పలుమార్లు ఆర్బీఐ క్లారిటీ ఇచ్చినప్పటికీ అదే అపోహ కొనసాగుతోంది. దీంతో నాణేల చెల్లుబాటుపై ప్రజలకు ఉన్న అపోహలను తొలగించి, అవగాహన కలగించేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నాణేల చెల్లుబాటుపై సోమవారం నాడు ప్రజలకు వాట్సాప్లో పర్సనల్ మెసేజ్లు పంపించింది. నాణేల చెల్లుబాటుపై అవగాహన కల్పించేలా ఒక వీడియోను కూడా షేర్ చేసింది.
వాట్సాప్లో ఆర్బీఐ పంపిన సందేశం మేరకు.. నాణేలు వేర్వేరు డిజైన్లతో ఉన్నప్పటికీ అవన్నీ చలామణీలో ఉన్నాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. 50 పైసలు మొదలుకొని రూ.1, 2, 5, 10, 20 నాణేలు అన్నీ చట్టబద్ధమైనవేనని.. అవన్నీ సుదీర్ఘకాలం చలామణీలో ఉంటాయని తెలిపింది. నాణేల గురించి తప్పుదారి పట్టించే సమాచారాన్ని, పుకార్లను నమ్మవద్దని సూచించింది. ఎలాంటి సందేహం లేకుండా నాణేలను స్వీకరించాలని కోరింది. వ్యాపారులు కూడా సంకోచం లేకుండా ప్రజల నుంచి నాణేలను స్వీకరించాలని విజ్ఞప్తి చేసింది.