RBI | ముంబై, ఏప్రిల్ 9: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వరుసగా రెండో ద్రవ్యసమీక్షలోనూ కీలక వడ్డీరేట్లను తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను చేపట్టిన తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపోరేటును మరో పావుశాతం (25 బేసిస్ పాయింట్లు) కోత పెట్టినట్టు బుధవారం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. దీంతో 6.25 శాతం నుంచి 6 శాతానికి వచ్చింది. ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరి ద్రవ్యసమీక్షలో దాదాపు ఐదేండ్ల తర్వాత రెపోరేటును తొలిసారి పావుశాతం (6.5 శాతం నుంచి 6.25 శాతానికి) తగ్గించిన విషయం తెలిసిందే. 2020 మే తర్వాత ఈ ఫిబ్రవరిలోనే తగ్గించారు. ఈ క్రమంలో తాజా తగ్గింపు అరశాతానికి చేర్చగా.. గృహ, వాహన, వ్యక్తిగత రుణగ్రహీతలకు మరింత లబ్ధి చేకూర్చినైట్టెంది. ఈఎంఐల భారం ఇంకొంత దిగనున్నది మరి.
మున్ముందు మరిన్ని కోతలు
ఆర్బీఐ తమ ద్రవ్యవిధాన వైఖరిని ‘న్యూట్రల్’ నుంచి ‘ఎకామ్డేటివ్’కు మార్చుకున్నది. దీంతో రాబోయే ద్రవ్యసమీక్షల్లో వడ్డీరేట్లు స్థిరంగా లేదా తగ్గడమో జరుగనున్నాయి. సోమవారం నుంచి బుధవారం వరకు 3 రోజులపాటు ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా నేతృత్వంలో జరిగిన ద్రవ్యసమీక్షలో ఎంపీసీలోని మొత్తం ఆరుగురు సభ్యులూ రెపోరేటు తగ్గింపునకే ఓటేశారు. ఫలితంగా రెపోరేటుకు అనుసంధానమైన అన్ని ఈబీఎల్ఆర్ దిగిరానున్నాయి. రుణాల ఈఎంఐల భారం కూడా తగ్గనున్నదని బ్యాంకింగ్ వర్గాలు చెప్తున్నాయి.
పీ2ఎం పేమెంట్స్‌కు జోష్
పర్సన్-టు-మర్చంట్ పేమెంట్స్ (పీ2ఎం) కోసం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)లో లావాదేవీల పరిమితిని పెంచేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)కు ఆర్బీఐ అనుమతిచ్చింది. ప్రస్తుతం పీ2ఎంతోపాటు పర్సన్-టు-పర్సన్ (పీ2పీ) పేమెంట్స్‌కు యూపీఐ ద్వారా లక్ష రూపాయల లావాదేవీకే అనుమతి ఉన్నది. అయితే కొన్ని సందర్భాల్లో పీ2ఎం పేమెంట్స్‌ను రూ.2 లక్షలు, రూ.5 లక్షలదాకా చేసుకోవచ్చు.
4 శాతంగా ద్రవ్యోల్బణం
ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) ద్రవ్యోల్బణం 4 శాతానికి దిగిరావచ్చన్న ఆశాభావాన్ని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వ్యక్తం చేశారు. మునుపు దీన్ని 4.2 శాతంగా అంచనా వేసిన విషయం తెలిసిందే. దేశంలో వ్యవసాయోత్పత్తి బాగుందని, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పడుతున్నాయన్న ఆయన పరిస్థితులు ఇలాగే ఉంటే అన్నింటి ధరలు కూడా తగ్గుతాయన్న విశ్వాసాన్ని కనబర్చారు. కూరగాయల ధరలు దిద్దుబాటుకు లోనవుతుండటంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 21 నెలల కనిష్టాన్ని తాకుతూ 3.8 శాతానికి చేరిన సంగతి విదితమే. ఫలితంగా ఆహార ద్రవ్యోల్బణం గణాంకాలు సైతం కిందకొస్తున్నాయి.
వృద్ధి అంచనాకు కత్తెర
దేశ జీడీపీ వృద్ధిరేటుకు ఆర్బీఐ కోత పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) 6.5 శాతానికే పరిమితం కావచ్చని అంచనా వేసింది. మునుపు ఇది 6.7 శాతం గా ఉండటం విశేషం. అంతర్జాతీయ వాణిజ్యంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, విధానాల్లో అనిశ్చితి వల్లే ఆర్థిక వృద్ధి 0.2 శాతం మేర తగ్గవచ్చని అంచనా వేసినట్టు మల్హోత్రా తెలిపారు. వ్యవసాయ రంగం ఆశాజనకంగా కనిపిస్తున్నదని, తయారీ రంగం కోలుకుంటున్న సంకేతాలున్నాయని, సేవా రంగం స్థితిస్థాపకతను ప్రదర్శిస్తున్నదని చెప్తూనే.. టారిఫ్ వార్ దెబ్బకు భారతీయ వాణిజ్య ఎగుమతులు పడిపోవచ్చన్న ఆందోళనను వెలిబుచ్చారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇబ్బందికరమేనని హెచ్చరించడం గమనార్హం. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంగా దేశ ఆర్థిక వృద్ధిరేటు 6.5 శాతంగా ఉండొచ్చన్న మల్హోత్రా.. తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 6.5 శాతం, రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో 6.7 శాతం, మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 6.6 శాతం, నాల్గో త్రైమాసికం (జనవరి-మార్చి)లో 6.3 శాతంగా అంచనా వేశారు.
టారిఫ్‌లతోనే జీడీపీకి నష్టం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరతీసిన ప్రతీకార సుంకాలపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం కంటే దేశ జీడీపీ వృద్ధిరేటుపై ఇప్పుడు వాణిజ్య యుద్ధమే ఎక్కువగా ప్రభావం చూపేలా ఉందన్నారు. టారిఫ్‌ల దెబ్బకు మార్కెట్లో డిమాండ్ క్షీణిస్తుందని తెలిపారు. నిజానికి ఈ టారిఫ్ వార్.. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థల ప్రగతిపై నీలిమబ్బులు కమ్ముకునేలా చేస్తుందని, ఎగుమతుల పతనం, వృద్ధిరేటు క్షీణత, ద్రవ్యోల్బణం సవాళ్లను సృష్టిస్తుందని పేర్కొన్నారు. భారత్ కూడా ఇందుకు మినహాయింపు కాదన్నారు.
గోల్డ్‌లోన్ రూల్స్‌ను హేతబద్ధమే చేస్తాం
బంగారం రుణాలపై ప్రతిపాదించిన మార్గదర్శకాలు.. ఆ రుణాల లభ్యతను కఠినతరం చేయడానికి కాదని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. అయితే హేతుబద్ధం చేస్తామని చెప్పారు. ‘త్వరలోనే ముసాయిదా మార్గదర్శకాలు విడుదలవుతాయి. మా మదిలో గోల్డ్ లోన్ రూల్స్‌ను కఠినం చేయాలన్న ఆలోచనేదీ లేదు. కేవలం హేతుబద్ధీకరణపైనే దృష్టి పెట్టాం’ అని ఆర్బీఐ ద్రవ్యసమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడుతూ మల్హోత్రా చెప్పారు. పసిడి రుణాలపై ఆర్బీఐ కొత్త మార్గదర్శకాల నేపథ్యంలో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఆయా గోల్డ్ ఫైనాన్స్ సంస్థల షేర్లు నష్టపోయాయి. బీఎస్ఈలో ముత్తూట్ ఫైనాన్స్ షేర్ విలువ గరిష్ఠంగా 6.70 శాతం నష్టపోగా, మణప్పురం ఫైనాన్స్ 1.88 శాతం, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ 2.55 శాతం, చోళమండలం ఫిన్కో 2.37 శాతం క్షీణించాయి.
ఎవరేమన్నారు?
‘నేను కేవలం సంజయ్‌ని. అంతేగాని మహాభారతంలోని సంజయ్‌ని కాదు. ఆయనకున్నట్టు దివ్యదృష్టి నాకు లేదు. ప్రస్తుత ప్రపంచ అనిశ్చితి ఎప్పుడు వీడుతుంది. వడ్డీరేట్లు ఇంకెంత తగ్గడానికి వీలుంది అన్న వివరాలు నేను చెప్పలేను’ అన్నారు విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. ఇక బ్యాంకింగ్ వ్యవస్థ సురక్షితంగానే ఉందని, ఇండస్ఇండ్ సంక్షోభం ఒక ఎపిసోడ్ మాత్రమేనని, వైఫల్యం కాదన్నారు.
ఆర్బీఐ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఇప్పుడున్న వాణిజ్య అనిశ్చిత పరిస్థితుల మధ్య దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ రకమైన ప్రోత్సాహం అవసరం
-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
టారిఫ్‌లు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల నడుమ ఆర్బీఐ ప్రగతిదాయక ద్రవ్య విధానాన్ని ప్రకటించింది. దేశంలో తగ్గుతున్న ద్రవ్యోల్బణం, సుస్థిర ఆర్థిక వ్యవస్థకు ఇది నిదర్శనం. దీన్ని స్వాగతిస్తున్నాం.
-బొమన్ ఇరానీ, క్రెడాయ్ జాతీయాధ్యక్షుడు
వరుస ద్రవ్యసమీక్షల్లో రెపోరేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించడం.. ప్రస్తుత ప్రపంచ అనిశ్చిత పరిస్థితులకు తగ్గ ద్రవ్య విధానాన్నే ప్రతిబింబిస్తున్నది. మార్కెట్‌కూ ఇది లాభదాయకం.
-సీఎస్ శెట్టి, ఎస్బీఐ చైర్మన్
ఈ ఏడాది రెపోరేటు మరో 50 బేసిస్ పాయింట్లు తగ్గవచ్చని మేము భావిస్తున్నాం. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వడ్డీరేట్ల తగ్గింపు భారత ఆర్థిక వ్యవస్థకు ఉత్సాహన్నిచ్చేదే.
-రాధికారావు, డీబీఎస్ బ్యాంక్ ఈడీ
ద్రవ్యసమీక్ష ముఖ్యాంశాలు