ముంబై, ఫిబ్రవరి 7: రుణగ్రహీతలకు శుభవార్త. హౌజింగ్, ఆటో, పర్సనల్ లోన్లపై ఈఎంఐలు తగ్గనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చాలాకాలం తర్వాత కీలక వడ్డీరేట్లకు కోత పెట్టింది మరి. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) చివరి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో దాదాపు ఐదేండ్ల తర్వాత రెపో రేటును పావు శాతం తగ్గిస్తూ సెంట్రల్ బ్యాంక్ నిర్ణయం తీసుకున్నది. చివరిసారిగా 2020 మే నెలలో రెపో తగ్గింది. ఆ తర్వాత నుంచి పెరగడమో లేదా ఎక్కడిదక్కడే అన్నట్టుగానే ఉండిపోయింది. ఈ క్రమంలో శుక్రవారం రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25 శాతానికి చేర్చినట్టు ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. మునుపు ఇది 6.50 శాతంగా ఉండేది. దీంతో బ్యాంకులూ తమ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించబోతున్నాయి.
ప్రస్తుతం అధిక శాతం రుణాలు రెపో రేటుకు అనుసంధానంగా ఉన్నవేనన్న విషయం తెలిసిందే. కాగా, ఈసారి ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు మొదట్నుంచే ఉన్నాయి. వాటికి తగ్గట్టుగానే నిర్ణయం వెలువడింది. నిజానికి గత ద్రవ్యసమీక్షలోనే వడ్డీరేట్ల కోతల సంకేతాలను అప్పటి గవర్నర్ శక్తికాంత దాస్ ఇచ్చారు. ఇందుకు తగ్గట్టుగానే మల్హోత్రా తన తొలి ద్రవ్యసమీక్షలోనే కోతకు దిగారు. అయినప్పటికీ ఆర్బీఐ ద్రవ్య వైఖరి తటస్థ విధానంలోనే ఉన్నది. దీంతో జీడీపీ, ద్రవ్యోల్బణం గణాంకాలకు తగ్గట్టుగా రాబోయే సమీక్షల్లో వడ్డీరేట్లు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. కాగా, ఈసారి సమీక్షలో ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ)లోని సభ్యులంతా వడ్డీరేట్ల తగ్గింపునకే ఓటేశారు.
వచ్చే 2025-26లో దేశ జీడీపీ వృద్ధిరేటు 6.7 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. ఇక 2024-25 జీడీపీ 6.4 శాతంగా నమోదు కావచ్చని ఆర్బీఐ అంటున్నది.
సెబీలో నమోదైన నాన్-బ్యాంక్ బ్రోకర్లు ఇకపై నేరుగా నెగోషియేటెడ్ డీలింగ్ సిస్టమ్-ఆర్డర్ మ్యాచింగ్ (ఎన్డీఎస్-ఓఎం) చేయవచ్చు. సెకండరీ మార్కెట్ లావాదేవీల కోసం ఇతర క్లెయింట్ల తరఫున ఇదో ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌గా ఉన్నది.
సైబర్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఇకపై భారతీయ బ్యాంకులు ‘బ్యాంక్.ఇన్’ పేరుతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్నెట్ డొమెయిన్‌ను అనుసరించనున్నాయి. అలాగే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లు ‘ఫిన్.ఇన్’ పేరు తో వెళ్లనున్నాయి. ఈ మేరకు ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది. ఏప్రిల్ 1 నుంచి బ్యాంక్.ఇన్ మొదలవుతుంది. ఆ తర్వాత ఫిన్.ఇన్ కూడా వస్తుంది. డిజిటల్ చెల్లింపుల్లో మోసాలు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు.
భారత్ 7 శాతానికిపైగానే ఆర్థిక వృద్ధిని నమోదు చేయగలదన్న విశ్వాసాన్ని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హో త్రా వ్యక్తం చేశారు. శుక్రవారం ద్రవ్యసమీక్ష సందర్భంగా మాట్లాడుతూ.. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ నిర్ధిష్ట స్థాయిల్లో ఉండాలన్న లక్ష్యాన్ని పెట్టుకోలేదన్నారు. ఒడిదొడుకులు తీవ్రమైతే తప్పక జోక్యం చేసుకుంటామన్న ఆయన ఇప్పుడు రూపాయి విలువ పతనం కంటే అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులే ప్రమాదమన్నారు. ఇక మందగించిన దేశ ఆర్థిక వ్యవస్థను వడ్డీరేట్ల తగ్గింపు ఉత్తేజపర్చగలదన్న విశ్వాసాన్ని గవర్నర్ మల్హోత్రా కనబర్చారు.
ఆర్బీఐ తగ్గించిన పావు శాతం రెపో రేటు.. మార్కెట్‌పై పరిమితంగానే ప్రభావం చూపిస్తుందనుకుంటున్నాం. కాబట్టి తదుపరి ద్రవ్యసమీక్షల్లో మరింతగా వడ్డీరేట్లను తగ్గిస్తేనే హౌజింగ్ డిమాండ్ పుంజుకునే వీలున్నది.
-బొమన్ ఇరానీ, క్రెడాయ్ అధ్యక్షుడు
నిర్మాణ రంగంపై ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపు సానుకూల ప్రభావాన్నే చూపగలదు. గృహ రుణాలు చౌకైతే, ఇండ్ల అమ్మకాలు పెరుగుతాయి. కాబట్టి బ్యాంకులు వెంటనే రుణాలపై వడ్డీరేట్లను తగ్గించాలి.
-జీ హరిబాబు, నరెడ్కో అధ్యక్షుడు
ఆర్బీఐ నిర్ణయం మదుపరుల్లో విశ్వాసాన్ని నింపింది. ఇండ్ల కొనుగోళ్లు పెరిగి దేశంలో నిర్మాణ రంగాభివృద్ధికి దోహదం చేయగలదు.
-జీ మధుసూదన్, సుమధుర గ్రూప్
దేశ జీడీపీ వృద్ధికి బడ్జెట్లో తీసుకున్న నిర్ణయాలకు ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపు కూడా తోడైంది.
-ఎంవీ రావు, ఐబీఏ చైర్మన్
సరైన సమయంలోనే వడ్డీరేట్ల తగ్గింపు ప్రక్రియను ఆర్బీఐ ఆరంభించింది. ఆర్బీఐ ఇతర నిర్ణయాలూ భేష్.
-సీఎస్ శెట్టి, ఎస్బీఐ చైర్మన్
ఆర్థిక వృద్ధి బలోపేతానికి, స్థిరత్వానికి ఆర్బీఐ నిర్ణయం కలిసొస్తుంది. ద్రవ్యోల్బణం మరింత తగ్గితే.. రాబోయే ద్రవ్యసమీక్షల్లో వడ్డీరేట్లు ఇంకా దిగొస్తాయన్న నమ్మకం మాకున్నది.
-చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్
ఆర్బీఐ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. బ్యాంకులు కూడా ఈ దిశగా అడుగులు వేస్తాయని భావిస్తున్నాం.
-హర్షవర్ధన్ అగర్వాల్, ఫిక్కీ అధ్యక్షుడు
వాహన, నిర్మాణ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ తదితర దేశంలోని ప్రధాన రంగాలకు ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.
-సంజయ్, అసోచామ్ అధ్యక్షుడు
ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపు.. టూవీలర్, చిన్న కార్లకు గిరాకీని పెంచగలదు.
-సియామ్, ఫడా అధ్యక్షులు