న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: ప్రస్తుతం కొనసాగుతున్న ప్రతీకార సుంకాల విధింపుపై నెలకొన్న పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు రిజర్వుబ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులను బేరీజ్ వేసుకొని కీలక నిర్ణయాలను వేగవంతంగా తీసుకుంటున్నట్టు చెప్పారు. అయినప్పటికీ దేశీయ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక మార్కెట్లు స్థితిస్థాపకతను ప్రదర్శించాయని 24వ ఎఫ్ఐఎంఎండీఏ-పీడీఏఐ వార్షికోత్సవ సమావేశంలో చెప్పారు.
ప్రస్తుతం ధరల సూచీ ఆరేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయినప్పటికీ అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంటుందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 6.5 శాతంగా అంచనావేసినప్పటికీ, వేగవంతమైన వృద్ధిని సాధిస్తున్నది భారతేనని ఆయన స్పష్టంచేశారు.