న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మన ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని, వృద్ధి మందగించడంతో పాటు ధరలు పెరుగుతాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ హెచ్చరించారు. ఒమిక్రాన్ వేవ్ నెమ్మదించడంతో ఆర్థిక వ్యవస్థ సానుకూల ప్రయోజనాలు పొందుతుందంటూ 2022 ఫిబ్రవరి మీటింగ్లో తాము వేసిన అంచనాలు.. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంతో మారిపోయాయని దాస్ తెలిపారు. ద్రవ్య పరపతి విధాన నిర్ణయాల్ని శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముడి చమురు, సహజవాయువు, అల్యూమినియం, పల్లాడియం, గోధుమ, మొక్కజొన్న, వంటనూనెలు, ఎరువులు వంటి కమోడిటీలు ఉత్పత్తి, ఎగుమతిలో ప్రధాన దేశాలైన రష్యా-ఉక్రయిన్ల మధ్య తలెత్తిన యుద్ధంతో రానున్న రోజుల్లో పలు ఆహారోత్పత్తుల ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నామన్నారు. దీంతో ఆర్బీఐ 2022-23 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాను 5.7 శాతానికి పెంచింది. ఇది 4.5 శాతంగా ఉంటుందని గత సమీక్షలో ఆర్బీఐ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్రూడ్ ధర సగటున 100 డాలర్లు ఉంటుందన్న అంచనాల ఆధారంగా ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని ఆర్బీఐ పెంచింది.
సరళతర విధానానికి స్వస్తి
ద్రవ్యోల్బణం కోరలు చాస్తున్నప్పటికీ, ఆర్బీఐ తాజా సమీక్షలో కీలక వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులూ చేయలేదు.వరుసగా 11వ సమీక్షలోనూ రేట్లను యథాతథంగా కొనసాగించడం గమనార్హం. మూడు రోజులపాటు సమావేశమైన ఆరుగురు సభ్యులతో కూడిన మానిటరీ పాలసీ కమిటీ రెపో రేటును స్థిరంగా 4 శాతం వద్దే ఉంచాలని ఏకగ్రీవంగా ఓటు చేసిందని దాస్ తెలిపారు. అయితే సమీప భవిష్యత్తులో వృద్ధికి మద్దతునిస్తూనే ద్రవ్యోల్బణం లక్ష్యంగా చేసుకోవాలని, సరళతర విధానాన్ని క్రమేపీ ఉపసంహరించే దిశగా పనిచేయాలని కమిటీ నిర్ణయించినట్టు వెల్లడించారు. దీంతో సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లను పెంచే సంకేతాల్ని ఇచ్చినట్లయ్యింది.
కొత్త గృహ రుణాలకు కనిష్ఠ రేట్లే
తాజా సమీక్షలో గృహ కొనుగోలుదార్లకు ఆర్బీఐ ఊరటనిచ్చింది. బ్యాంక్లు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లను ప్రభావితం చేసే రెపో, రివర్స్ రెపోలను కనిష్ఠస్థాయి వద్దే అట్టిపెట్టడంతో ఎలాగూ తక్కువ వడ్డీకి గృహ రుణాలు లభిస్తాయి. అలాగే హౌసింగ్ లోన్లపై రిస్క్ వెయిటేజిపై హేతుబద్దీకరించిన నిబంధనలు మరో ఏడాదిపాటు వర్తించేలా ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనల ప్రకారం కొత్త గృహ కొనుగోలుదార్లకు తక్కువ వడ్డీపై బ్యాంక్లు రుణాలిచ్చే వెసులుబాటు ఉంటుంది. సమీప భవిష్యత్లో కీలక రేట్లను ఆర్బీఐ పెంచినా, కొత్తగా ఇల్లు కొనేవారికి మాత్రం 2023 మార్చి వరకూ కనిష్ఠ వడ్డీ రేట్లకే రుణాలు లభిస్తాయి.
ఆర్బీఐ విధాన నిర్ణయాలు
ధరల పెరుగుదలకు ఆర్బీఐ కారణాలివీ..