ముంబై, ఏప్రిల్ 11: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దేశీయ రెమిటెన్స్‌లపై తీవ్రస్థాయిలో ప్రతికూల ప్రభావం పడనున్నదని సర్వే సంస్థలు అంచనావేస్తున్నాయి. దేశంలోకి వచ్చే విదేశీ రెమిటెన్స్‌ల్లో మూడోవంతు గల్ఫ్ దేశాల నుంచి వస్తుండటం ఇందుకు కారణమని దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రేటింగ్స్ వెల్లడించింది. విదేశాల్లో ఉన్న ప్రవాసుల ఆదాయ వనరులు తగ్గుముఖం పట్టడం కూడా రెమిటెన్స్‌లు తగ్గడానికి ప్రధాన కారణమని విశ్లేషించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లోకి 135 బిలియన్ డాలర్ల విలువైన రెమిటెన్స్‌లు వచ్చాయి. అంతక్రితం ఏడాది వచ్చిన రెమిటెన్స్‌లతో పోలిస్తే రెండంకెలు వృద్ధి నమోదైంది. మరోవైపు, ప్రపంచ దేశాల్లో వాణిజ్య యుద్ధ భయాలు కూడా దేశీయ ఎగుమతుల్లో వృద్ధి అంతంత మాత్రంగానే నమోదైందని పేర్కొంది.
మరోవైపు, క్రూడాయిల్ ధరలు భగ్గుమనడంతో దిగుమతి కోసం చెల్లించే బిల్లులు 8-9 శాతం వరకు అధికంకానున్నట్టు అంచనావేస్తున్నది. సంఘర్షణ కారణంగా ఏర్పడిన రవాణా పరమైన సవాళ్లు, సరఫరా వ్యవస్థలో నెలకొన్న అవాంతరాలు పశ్చిమాసియా ఎగుమతులపై ప్రభావితం చూపనున్నాయని నివేదిక వెల్లడించింది. భారత్ నుంచి గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ దేశాలకు 57 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. మొత్తం దేశీయ ఎగుమతుల్లో వీటి వాటా 13 శాతంగా ఉన్నది. అలాగే పశ్చిమాసియా దేశాలకు 9 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. జీసీసీ దేశాల్లో బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాలు ఉండగా, పశ్చిమాసియా దేశాల్లో ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, జోర్డాన్, లెబనాన్, సిరియా, యెమెన్ దేశాలు ఉన్నాయి. మొత్తం ఎగుమతుల్లో 70 శాతం బాస్మతి బియ్యం అవుతుండగా, 25 శాతం సెరామిక్స్, 15 శాతం పెట్రోలియం ఉత్పత్తులు, 20 శాతం జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ ఉన్నాయి.