న్యూఢిల్లీ, డిసెంబర్ 22: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్).. మెట్రో ఇండియాను సొంతం చేసుకున్నది. రూ.2,850 కోట్లకు డీల్ కుదిరింది. ఈ మేరకు ఆర్ఐఎల్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్వీఎల్)కు, మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు మధ్య ఒప్పందం జరిగింది. నిశ్చయాత్మక ఒప్పంద పత్రాలపై ఇరు సంస్థల ఉన్నతాధికారులు సంతకాలు చేసినట్టు ఆయా కంపెనీలు గురువారం ఓ ప్రకటనలో స్పష్టం చేశాయి.
పూర్తిగా నగదు రూపంలోనే ఈ లావాదేవీ జరుగనుండగా.. మెట్రో ఇండియాలో 100 శాతం వాటా ఆర్‌ఆర్‌వీఎల్‌కు దక్కుతుంది. కాగా, జర్మనీ ప్రధాన కేంద్రంగా నడుస్తున్న మెట్రో ఏజీ సంస్థ.. భారత్‌లో మెట్రో ఇండియా పేరుతో హోల్‌సేల్ వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇదో బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ) సంస్థ. హోటళ్లు, రెస్టారెంట్లు, కార్యాలయాలు, కంపెనీలు, కిరాణా దుకాణాలు, చిన్నతరహా రిటైలర్లే మెట్రోకు కస్టమర్లు.
రిటైల్ విభాగానికి దన్ను
మెట్రో ఇండియా వ్యాపారం కొనుగోలు.. రిలయన్స్ రిటైల్‌కు మరింత బలం చేకూర్చగలదని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా 16,600లకుపైగా రిలయన్స్ రిటైల్ స్టోర్లున్నాయి. వీటికి మెట్రో హోల్‌సేల్ స్టోర్లు కూడా తోడవుతున్నాయి. దీంతో భారతీయ రిటైల్ వ్యాపారంలో రిలయన్స్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించడం ఖాయమనే అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. అటు హోల్‌సేల్, ఇటు రిటైల్ విభాగంలో రిలయన్సే ముందుంటుందని చెప్తున్నారు. కిరాణా దుకాణదారులతోపాటు, ఇతరత్రా సంస్థాగత కస్టమర్లు ఈ లావాదేవీతో రిలయన్స్‌కు చేరువయ్యారని గుర్తుచేస్తున్నారు. భారతీయ రిటైల్ మార్కెట్ విలువ రూ.60 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా.
ఇందులో ఆహార, కిరాణా వాటానే 60 శాతం