Reliance | రిలయన్స్ `శిఖ`లోకి మరో సంస్థ వచ్చి చేరింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ రిలయన్స్ పెట్రోలియం రిటైల్ తాజాగా శుభలక్ష్మి పాలిస్టర్స్ (ఎస్పీఎల్), శుభలక్ష్మి పాలిటెక్స్ (ఎస్పీటెక్స్)లను టేకోవర్ చేసింది. శుభలక్ష్మి పాలిస్టర్‌కు చెందిన ఎస్పీఎల్, ఎస్పీటెక్స్ సంస్థలను రూ.1592 కోట్లకు స్వాధీనం చేసుకున్నది. ఎస్పీఎల్ రూ.1522 కోట్లు, ఎస్పీటెక్స్ రూ.70 కోట్లకు రిలయన్స్ సొంతం చేసుకోనున్నది. అయితే, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా శుభలక్ష్మి పాలిస్టర్ సంస్థకు రుణాలిచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రిలయన్స్ టేకోవర్ చేయడానికి ఆమోదం లభించాల్సి ఉంది.
ఎస్పీఎల్ ప్రతియేటా 2.52 లక్షల మెట్రిక్ టన్నుల పాలిమర్స్ ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంది. ఇంకా పాలిస్టర్ ఫైబర్, నూలు, టైక్స్‌టైల్ గ్రేడ్ చిప్‌లను కూడా తయారు చేస్తుంది. ఎస్‌పీఎల్‌కు గుజరాత్‌లోని దాహెజ్, దాద్రా అండ్ నగర్ హవేలీలోని సిల్వాస్సా యూనిట్లలో పాలిస్టర్ బిజినెస్‌లు ఉన్నాయి. దాహెజ్లోని ఎస్పీటెక్స్ ఆధ్వర్యంలో ఆకృతి నూలు ( Texturized Yarn ) ఉత్పత్తి చేస్తుంది.
పాలిస్టర్ బిజినెస్‌లోకి ఎంటరయ్యే వ్యూహంలో భాగంగా శుభలక్ష్మి పాలిస్టర్స్ను రిలయన్స్ పెట్రోలియం రిటైల్ టేకోవర్ చేసింది. 2021లో ఎస్పీఎల్ టర్నోవర్ రూ.1768 కోట్లు. 2019లో రూ.2702.50 కోట్లు, 2020లో రూ.2249.08 కోట్లు. ఎస్పీటెక్స్ టర్నోవర్ 2019లో రూ.337.02 కోట్లు, 2020లో రూ.338 కోట్లు, 2021లో రూ.267.40 కోట్లుగా రికార్డయింది.