Reliance Jio IPO | ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ టెలికం సంస్థ జియో.. ఐపీఓ ద్వారా 100 బిలియన్ల డాలర్ల పై చిలుకు నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. 2025లో ఐపీఓకు వెళ్లాలని రిలయన్స్ జియో వెళ్లనున్నదని, అటుపై వచ్చే ఏడాది చివర్లో రిలయన్స్ రిటైల్ సైతం ఐపీఓ ద్వారా నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నదని ఈ అంశంతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు చెప్పారు. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ 2019లోనే తన రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ వచ్చే ఐదేండ్ల లోపు ఐపీఓకు వెళతాయని ప్రకటించారు కానీ ఐపీఓ టైమ్లైన్లు వెల్లడించలేదు.
479 మిలియన్ల సబ్ స్క్రైబర్లతో దేశంలోనే అతిపెద్ద టెలికం ప్రొవైడర్‌గా రిలయన్స్ జియో నిలిచింది. వచ్చే ఏడాది జియో ఐపీఓకు వెళ్లేందుకు అంతర్గతంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక రిలయన్స్ రిటైల్ బిజినెస్‌లో అంతర్గతంగా ఉన్న సవాళ్లను పరిష్కరించాల్సి ఉందని, అటుపైనే ఐపీఓకు వెళుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. దీనిపై స్పందించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధికార ప్రతినిధి ముందుకు రాలేదు.
ఇప్పటికే స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీసు అందించేందుకు వస్తున్న ఎలన్ మస్క్‌తో రిలయన్స్ జియో పోటీ పడనున్నది. నివిదియా భాగస్వామ్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్న రిలయన్స్ జియోకు గూగుల్, మెటా మద్దతుగా ఉన్నాయి. అంతర్గతంగా జియో ఐపీఓకు వెళ్లాలని రిలయన్స్ నిర్ణయానికి వచ్చినా, ఐపీఓ విలువ ఎంత అన్న విషయమై ఇంకా నిర్ణయానికి రాలేదు. అందుకు బ్యాంకర్లను నియమించుకోలేదు. అయితే, గత జూలైలో జెఫరీస్ అనే కన్సల్టెంట్ సంస్థ మాత్రం రిలయన్స్ జియో ఐపీఓ విలువ 112 బిలియన్ డాలర్లు ఉండొచ్చునని అంచనా వేసింది.
ఇప్పటికైతే ఐపీఓ చర్చలు పూర్తిగా అంతర్గతం అని, ఐపీఓ టైం లైన్ మారే అవకాశం కూడా ఉందని రిలయన్స్ వర్గాల కథనం. భారత దేశీయ స్టాక్ మార్కెట్లలో అక్టోబర్ నాటికి 270 కంపెనీలు ఐపీఓల ద్వారా లిస్టింగ్ కావడంతోపాటు 12.58 బిలియన్ డాలర్ల నిధులు సేకరించాయి. గతేడాది ఐపీఓల ద్వారా వివిధ సంస్థలు సేకరించిన నిధులు 7.42 బిలియన్ డాలర్లు మాత్రమే. టెలికం, డిజిటల్ బిజినెస్‌ల వేదిక జియో ప్లాట్‌ఫామ్స్‌లోని 17.84 బిలియన్ల డాలర్ల విదేశీ ఇన్వెస్టర్ల నిధులు ఉన్నాయి. ఇది జియో ప్లాట్‌ఫామ్స్‌లో 33 శాతం. రిలయన్స్ రిటైల్ సంస్థలో 7.44 బిలియన్ డాలర్ల పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్లదే. ఇది మొత్తం రిలయన్స్ రిటైల్ మొత్తం విలువలో సుమారు 12 శాతం.