న్యూఢిల్లీ, ఆగస్టు 29 : దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా ఐపీవో త్వరలోనే రాబోతున్నది. వచ్చే ఏడాది ప్రథమార్ధం (జనవరి-జూన్)లో భారతీయ టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో పబ్లిక్ ఇష్యూకు వస్తున్నది. శుక్రవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) వాటాదారుల 48వ ఏజీఎం జరిగింది. ఈ సందర్భంగానే కంపెనీ సీఎండీ ముకేశ్ అంబానీ ఈ మేరకు వెల్లడించారు. జియో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయని చెప్పారు. అనుమతులన్నీ లభిస్తే.. వచ్చే జనవరి-జూన్ మధ్య జియో షేర్లు దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదవుతాయన్నారు. కాగా, జియో వినియోగదారులు ప్రస్తుతం 50 కోట్లపైనే ఉన్నారు. ఈ క్రమంలో రాబోయే ఐపీవో దేశ చరిత్రలోనే అతిపెద్దదిగా ఉండొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికైతే గత ఏడాది అక్టోబర్‌లో వచ్చిన హ్యుందాయ్ మోటర్ ఇండియా ఐపీవో (రూ.27,870 కోట్లు)నే భారతీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో అతిపెద్దది.
నానాటికీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్న కృత్రిమ మేధస్సు (ఏఐ)పై రిలయన్స్ ఇక పట్టు బిగించబోతున్నది. గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాలు గూగుల్, మెటా భాగస్వామ్యంలో రిలయన్స్ ఇంటెలిజెన్స్ పేరిట ఓ ఏఐ ఆధారిత సంస్థను ఆర్ఐఎల్ తీసుకురాబోతున్నది. 70:30 నిష్పత్తిలో రిలయన్స్, మెటా కలిసి ఇందులో రూ.855 కోట్ల పెట్టుబడుల్ని పెట్టనున్నాయని ముకేశ్ ఏజీఎంలో ప్రకటించారు.
ఈసారి ఏజీఎంలో ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ కూడా భాగస్వామి అయ్యారు. ఆకాశ్, ఇషా అంబానీలతో కలిసి అనంత్ స్టేజీని పంచుకోవడం విశేషం. ఈ ఏడాది మే నెలలోనే రిలయన్స్ బోర్డులోకి అనంత్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వచ్చిన విషయం తెలిసిందే. కాగా, తాజా ఏజీఎంలో అనంత్ మాటలనుబట్టి గతంలో సూచించినదానికంటే కూడా సంస్థలో ఆయనకు ముకేశ్ పెద్ద బాధ్యతల్నే అప్పగించే వీలున్నట్టు సంకేతాలొస్తున్నాయి. ప్రస్తుతం ఆకాశ్ జియోను, ఇషా రిటైల్ విభాగాలను చూస్తున్నారు.
స్మార్ట్ గ్లాస్, క్లౌడ్ పీసీ సెగ్మెంట్లలోకి జియో ప్రవేశించింది. జియోఫ్రేమ్స్ పేరిట స్మార్ట్ గ్లాసెస్‌ను ఆవిష్కరించింది. దీంతో కాల్స్, మ్యూజిక్, వీడియోల రికార్డింగ్ మొదలైనవి వినియోగదారులు ఇట్టే చేసుకోవచ్చు. తెలుగు సహా దేశంలోని వివిధ భాషల్లో ఏఐ వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. ‘జియోఫ్రేమ్స్ ఓ ఏఐ ఆధారిత వియరబుల్ వేదిక, ఎకోసిస్టమ్. భారత్ కోసమే’ అని రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ ఈ సందర్భంగా తెలిపారు. కాగా, ప్రస్తుతం రే-బాన్ మెటా ఏఐ గ్లాసెస్ ఈ సెగ్మెంట్లో దూసుకుపోతున్నది. ఇక అమెజాన్ అలెక్సా, యాపిల్ సిరి తరహాలో ఏఐ వాయిస్ అసిస్టెంట్ ‘రియా’ను జియో పరిచయం చేసింది. అలాగే జియోలెంజ్, జియోపీసీలూ ఉన్నాయి. ఇదిలావుంటే జియోహాట్‌స్టార్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అని, మొబైల్, టీవీ, ఇతర డివైజ్‌ల్లో 100 కోట్లకుపైగా వినియోగదారులున్నట్టు ఆకాశ్ చెప్పారు. అలాగే వచ్చే 3 ఏండ్లలో రిలయన్స్ రిటైల్ సీఏజీఆర్ 20 శాతానికి చేరవచ్చన్న ధీమాను ఇషా అంబానీ వ్యక్తం చేశారు. రాబోయే 5 ఏండ్లలో ఎఫ్ఎంసీజీ వ్యాపారం లక్ష కోట్ల రూపాయల ఆదాయాన్ని అందుకోవచ్చని అంచనా వేశారు.