Reliance | దేశీయ స్టాక్ మార్కెట్లో శుక్రవారం రిలయన్స్ షేర్లు దాదాపు మూడు శాతం లాభాలతో ముగిశాయి. గురువారం రిలయన్స్ ఇండస్ట్రీస్ మూడో త్రైమాసికంలో 7.4శాతం నికర లాభం గడించిన సంగతి తెలిసిందే. బీఎస్ఈలో రిలయన్స్ షేర్ 2.57 శాతం వృద్ధితో రూ.1301.30 వద్ద ముగిసింది. అంతర్గత ట్రేడింగ్‌లో 4.44శాతం పుంజుకుని రూ.1,3265.10లకు దూసుకెళ్లింది. మరోవైపు ఎన్ఎస్ఈలో రిలయన్స్ షేర్ 2.64శాతం వృద్ధితో రూ.1,300 వద్ద స్థిర పడింది. అంతర్గత ట్రేడింగ్‌లో 4.70 శాతం వరకూ వృద్ధితో రూ.1,326 వరకూ పెరిగింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.44,115.55 కోట్లు పెరిగి రూ.17,60,967.69 కోట్లకు చేరుకుంది. బీఎస్ఈలో 15.14 లక్షల షేర్లు, ఎన్ఎస్ఈలో 293.66 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.
రిటైల్ బిజినెస్ పుంజుకోవడం, టారిఫ్‌ల పెంపుతో జియో ఆదాయం పెంపు, ఆయిల్ అండ్ గ్యాస్‌తో కూడిన పెట్రో కెమికల్ బిజినెస్ నికరంగా లాభాలు గడించడంతో డిసెంబర్ త్రైమాసికంలో రిలయన్స్ 7.4 శాతం వృద్ధితో రూ.18,540 కోట్ల నికర లాభం గడించింది. ఏడాది క్రితం అంటే 2023-24 తృతీయ త్రైమాసికంలో రూ.17,265 కోట్ల నికర లాభం పొందింది.