న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: చమురు నుంచి కెమికల్స్ వరకు వ్యాపారాన్ని నిర్వహిస్తున్న దేశీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ నిరుత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.16,971 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.19,407 కోట్ల లాభంతో పోలిస్తే 12.5 శాతం క్షీణత నమోదైంది. డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన రూ.18,645 కోట్ల లాభం కంటే ఇది తక్కువ.
ప్రస్తుతం నెలకొన్న చమురు సంక్షోభం రిలయన్స్ ఆయిల్, కెమికల్ వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం చూపాయని పేర్కొంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చమురు ధరలు భారీగా పుంజుకోవడం, సరుకు రవాణాకోసం అధికంగా చెల్లింపులు జరపడం, బీమా పెరగడం కూడా లాభాలపై ప్రతికూల ప్రభావం చూపాయని రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు.
చమురు నుంచి కెమికల్స్ వ్యాపారాలు నిరుత్సాహకరంగా ఉన్నప్పటికీ టెలికాం, రిటైల్ రంగాలు అంచనాలకుమించి రాణించడంతో ఆదాయంలో రెండంకెల వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. గడిచిన త్రైమాసికంలో కంపెనీ రూ.3.03 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇది రూ.2.69 లక్షల కోట్లుగా ఉన్నది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.11.75 లక్షల కోట్ల ఆదాయంపై రూ.80,775 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో లాభాలు వాయుతరంగాల వేగంతో దూసుకుపోతున్నాయి. మార్చి త్రైమాసికానికిగాను సంస్థ రూ.7,935 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.7,022 కోట్ల లాభంతో పోలిస్తే 13 శాతం వృద్ధిని కనబరిచింది. సబ్‌స్ర్కైబర్లు పెరగడం, ఒక్కో కస్టమర్‌పై వచ్చే సరాసరి ఆదాయం పుంజుకోవడం వల్లనే లాభాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని ముకేశ్ అంబానీ వెల్లడించారు. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.33,986 కోట్ల నుంచి రూ.38,259 కోట్లకు చేరుకున్నట్టు తెలిపింది. సరాసరిగా ఒక్కో కస్టమర్‌పై వచ్చే ఆదాయం 3.8 శాతం ఎగబాకి రూ.214కి చేరుకున్నది. నెలకు సబ్‌స్ర్కైబర్ డాటా వినిమయం 35 శాతం ఎగబాకి 42.3 జీబీలకు చేరుకున్నది. ప్రస్తుతం కంపెనీకి 52.44 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు ఉన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.1,46,885 కోట్ల ఆదాయంపై రూ.30,053 కోట్ల లాభాన్ని నమోదు చేసుకున్నది.
రిటైల్ విభాగ లాభాలు అంతంతే మాత్రంగానే నమోదయ్యాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను రూ.3,563 కోట్ల నికర లాభాన్ని ఆర్జించగా, ఆదాయం మాత్రం 10.84 శాతం వృద్ధితో రూ.98,232 కోట్లకు చేరుకున్నట్టు ప్రకటించింది. గతేడాది మొత్తానికి రూ.3.70 లక్షల కోట్ల ఆదాయంపై రూ.13,842 కోట్ల నికర లాభాన్ని గడించింది. గత త్రైమాసికంలో కొత్తగా 333 రిటైల్ అవుట్లెట్లను ప్రారంభించడంతో మొత్తం సంఖ్య 20,160కి చేరుకున్నాయి.