న్యూఢిల్లీ, జనవరి 11: రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ తాజాగా తిరిగి 100 బిలియన్ డాలర్ల క్లబ్లో చేరారు. వరుస రెండు రోజుల ర్యాలీతో రిలయన్స్ షేరు ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయికి చేరడంతో ఫోర్బ్స్ రియల్‌టైమ్ జాబితా ప్రకారం ముకేశ్ సంపద 105.1 బిలియన్ డాలర్లకు (రూ.8.75 లక్షల కోట్లు) చేరింది. దీంతో గ్లోబల్ బిలియనీర్లలో ప్రస్తుతం అంబానీ 11వ స్థానంలో ఉన్నారు. ఈ ప్రపంచ జాబితాలో 100 బిలియన్ డాలర్ల క్లబ్లో మొత్తం 12 మంది ఉన్నారు. బుధ, గురువారాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) షేరు 5.4 శాతం పెరిగి రూ.2,720 రికార్డుస్థాయి వద్ద ముగిసింది.
ఆర్ఐఎల్ మార్కెట్ విలువ రూ.18 లక్షల కోట్లను మించింది. ఈ కంపెనీలో అంబానీ కుటుంబానికి మెజారిటీ వాటా ఉన్నది. వాస్తవానికి గత జులైలోనే ఆర్ఐఎల్ షేరు రూ.2,850 వద్దకు పెరిగినప్పటికీ, ఈ కంపెనీ నుంచి ఎన్బీఎఫ్సీ సబ్సిడరీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను విభజించడంతో స్టాక్ ఎక్సేంజీలు నిర్వహించిన ప్రత్యేక ట్రేడింగ్‌లో ఆర్ఐఎల్ షేరు ధర రూ.2,630 వద్ద స్థిరపడింది. గురువారం జియో ఫైనాన్షియల్ షేరు 4.7 శాతం పెరిగి రూ. 251 వద్ద నిలిచింది.
ఆర్ఐఎల్ గ్రూప్‌లోని మరో కంపెనీ టీవీ18 బ్రాడ్కాస్ట్ వరుసగా 5 ట్రేడింగ్ సెషన్లలో 25 శాతం పెరిగింది. ముకేశ్ అంబానీ 2021లో తొలుత 100 బిలియన్ డాలర్ల క్లబ్లో ప్రవేశించినప్పటికీ, అటుతర్వాత ఆ స్థానాన్ని కోల్పోయారు. ప్రస్తుతం ఫోర్బ్స్ రియల్‌టైమ్ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ 16వ స్థానంలో ఉన్నారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 240.9 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఫ్రాన్స్ ఫ్యాషన్ వాణిజ్యవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్, అమెజాన్ హెడ్ జెఫ్ బెజోస్‌లు ద్వితీయ, తృతీయస్థానాల్లో ఉన్నారు.