ముంబై, జనవరి 16: రిలయన్స్ ఇండస్ట్రీస్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.18,645 కోట్లు లేదా ప్రతిషేరుకు రూ.13.78 నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.18,540 కోట్లతో పోలిస్తే ఫ్లాట్‌గా ముగిసింది. గ్యాస్ ఉత్పత్తి పడిపోవడంతోపాటు రిటైల్ వ్యాపారంలోని బలహీనత కారణంగా లాభాలపై ప్రతికూల ప్రభావం చూపిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణ కారణంగా రిటైల్ వ్యాపార ఆదాయంలో నిరుత్సాహకర వృద్ధి నమోదైందని, ఇదే సమయంలో ఇంధన, డిజటల్ వ్యాపారాలు రాణించినప్పటికీ మెరుగైన లాభాలను అందుకోలేకపోయింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.2.69 లక్షల కోట్లకు చేరుకున్నట్టు వెల్లడించింది. కిందటేడాది ఇదే సమయానికి రూ.2.43 లక్షల కోట్లుగా నమోదైంది.
టెలికాం, డిజిటల్ బిజినెస్ కోసం రిలయన్స్ నెలకొల్పిన జియో ప్లాట్‌ఫాం అంచనాలకుమించి రాణిస్తున్నది. గత త్రైమాసికానికిగాను రూ.7,629 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.6,857 కోట్ల లాభంతో పోలిస్తే 11.3 శాతం వృద్ధిని కనబరిచింది. సబ్‌స్ర్కైబర్లు పెరగడం, ఒక్కో యూజర్ నుంచి వచ్చే సరాసరి ఆదాయం అధికమవడం, డిజిటల్ సర్వీసులకు పెరుగుతున్న డిమాండ్ సంస్థకు కలిసొచ్చింది.
కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 12.7 శాతం అందుకొని రూ.37,262 కోట్లకు చేరుకున్నది. సరాసరిగా ఒక్కో కస్టమర్‌పై నుంచి వచ్చే ఆదాయం 5.1 శాతం ఎగబాకి రూ.213.7కి పెరిగింది. కిందటేడాది ఇది రూ.203.3గా ఉన్నది. ప్రస్తుతం సంస్థకు 51.57 కోట్ల మొబైల్ సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. దీంతోపాటు మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫాం జియోస్టార్ రూ.8,010 కోట్ల ఆదాయంపై రూ.888 కోట్ల నికర లాభాన్ని గడించింది.
రిలయన్స్ రిటైల్ వెంచర్ నిరాశాజనక పనితీరు కనబరిచింది. అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలానికిగాను రూ.97,605 కోట్ల స్థూల ఆదాయంపై రూ.3,551 కోట్ల నికర లాభాన్ని గడించింది. లాభంలో 2.7 శాతం వృద్ధిని నమోదు చేసుకున్న సంస్థ..అటు ఆదాయంలో 8.1 శాతం వృద్ధితో సరిపెట్టుకున్నది. గత త్రైమాసికంలో కొత్తగా 431 నూతన స్టోర్లను ప్రారంభించింది. దీంతో మొత్తం రిటైల్ అవుట్లెట్ల సంఖ్య 19,979కి చేరుకున్నాయి.
అన్ని వర్టికల్స్‌లో స్థిరమైన వృద్ధిని నమోదు చేసుకుంటున్నది. జియో వ్యాపారాన్ని మరింత విస్తరించడంతో ఆర్థిక దన్నుగా నిలుస్తున్నది. కన్జ్యూమర్ వ్యాపారాన్ని విడగొడుతూ తీసుకున్న నిర్ణయం ఈ త్రైమాసికం నుంచి అమలులోకి రానున్నది.
– ముకేశ్ అంబానీ, రిలయన్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్