Reliance@Rs 19 Trillion | రిలయన్స్ ఇండస్ట్రీస్ చరిత్రలో మరో మైలురాయి నమోదైంది. బుధవారం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ)లో రిలయన్స్ షేర్ రికార్డ్ స్థాయికి దూసుకెళ్లింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో రూ.2,827.10 (రెండు శాతం వృద్ధి)తో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.19 లక్షల కోట్ల మార్క్‌ను దాటేసింది. ఉదయం 9.33 గంటల సమయంలో రిలయన్స్ ఎం-క్యాప్ రూ.19.02 లక్షల కోట్లు (రిలయన్స్ షేర్ రూ.2,811.85) పలికింది.
వారం రోజులుగా రిలయన్స్ స్క్రిప్ట్ 11 శాతం లాభ పడింది. ఈ నెల 18న స్టాక్ ధర రూ.2,544 వద్ద మొదలైంది. గత మూడు నెలల్లో 20 శాతం వృద్ధి చెందింది. రిలయన్స్ పెట్రో కెమికల్ బిజినెస్ అద్భుతంగా సాగుతున్నదని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ధరల పెరుగుదల ప్రభావం రిలయన్స్‌పై పడలేదన్నారు. సంప్రదాయేతర ఇంధన వనరుల బిజినెస్‌లో విస్తరణ దిశగా రిలయన్స్ ముందుకెళుతున్నదన్నారు.
పెట్రో కెమికల్స్ రిఫైనింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్‌ప్లోరేషన్, రిటైల్, డిజిటల్ సర్వీసెస్, మీడియా తదితర విభిన్న రంగాల్లో రిలయన్స్ సేవలందిస్తున్నది. మంగళవారం అబుదాబీ కెమికల్స్ డెరివేటివ్స్ కంపెనీ ఆర్ఎస్సీ (టీఏజడ్ఐజడ్)తో రిలయన్స్ మంగళవారం ఒప్పందంపై సంతకాలు చేసింది. అబుదాబిలోని రువాయిస్‌లో కెమికల్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది.