GST | కేంద్రం ప్రభుత్వం జీఎస్టీలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. నాలుగు శ్లాబులను రెండింటికి కుదించింది. ఈ మార్పుతో రియల్ ఎస్టేట్‌కు ఊతం లభిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. నిర్మాణరంగంలోని పలు వస్తువల ధరలకు సంబంధించిన శ్లాబ్‌ను మార్చడంతో ఇన్పుట్ ఖర్చులు తగ్గుతాయని పేర్కొంటున్నారు. భారత్, ఆగ్నేయాసియా, పశ్చిమ ఆసియా, ఆఫ్రికా సీబీఆర్ఈ అధ్యక్షుడు, సీఈవో అన్షుమాన్ జీఎస్టీ మార్పుతో వ్యయ ప్రభావాలను హైలెట్ చేశారు. సిమెంట్, స్టీల్, ఇతర ఇన్పుట్స్ సాధారణంగా మొత్తం నిర్మాణ వ్యయంలో 40-45 శాతం వాటా కలిగి ఉంటాయని తెలిపారు. దాంతో తగ్గింపు ప్రాజెక్ట్ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుందని పేర్కొన్నారు. డెవలపర్లు ఇప్పుడు పొదుపులో కొంత భాగాన్ని గృహ కొనుగోలుదారులకు బదిలీ చేయవచ్చని.. దాంతో గృహాలను కొనుగోలు చేసే అవకాశం పెరగడంతో అన్నిరంగాల్లో డిమాండ్‌ను పెంచుతుందన్నారు. పండుగ సీజన్లో సరైన సమయంలోనే జీఎస్టీ సంస్కరణలు వచ్చాయి. గృహాభివృద్ధి, మౌలిక సదుపాయాల ఆధారిత ఆర్థిక వృద్ధిపై ప్రభుత్వ విస్తృత దృష్టికి ప్రభుత్వ చర్యలు ఊతమిస్తాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
హిరనందని గ్రూప్, నరేడ్కో నేషనల్ చైర్మన్ నిరంజన్ హిరనందని కేంద్రం నిర్ణయాన్ని భారతీయ వినియోగదారులకు ‘పండుగ కానుక’గా, ఆర్థిక వ్యవస్థకు వ్యూహాత్మక ప్రోత్సాహకంగా అభివర్ణించారు. రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగాలకు, సిమెంట్, ఉక్కు వంటి కీలకమైన నిర్మాణ సామగ్రిపై జీఎస్టీని 28శాతం నుంచి 18శాతానికి తగ్గించడం చారిత్రాత్మక సంస్కరణగా పేర్కొన్నారు. నిర్మాణ వ్యయంలో తగ్గుదల గృహ కొనుగోలుదారులకు బదిలీ చేయడం వల్ల.. గృహ నిర్మాణ రంగం ఎక్కువగా ప్రయోజనం పొందుతుందని హిరనందని తెలిపారు. దాంతో గృహాలు మరింత అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఇది ‘అందరికీ గృహనిర్మాణం’ అనే ప్రభుత్వ కల సాకారానికి ఊతమిస్తుందని తెలిపారు. డెవలపర్లకు మాత్రమే కాకుండా వినియోగదారులకు, గృహనిర్మాణ రంగానికి.. భారతదేశ దీర్ఘకాలిక వృద్ధికి ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఇలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, నరేడ్కో జాతీయ అధ్యక్షుడు జీ హరిబాబు మాట్లాడుతూ జీఎస్టీ హేతుబద్దీకరించడం చాలా ముఖ్యమైన దశ అని.. పరిశ్రమ హృదయపూర్వకంగా స్వాగతిస్తుందని తెలిపారు. ఈ చర్య రియల్ ఎస్టేట్, సంబంధిత పరిశ్రమలకు ప్రత్యేక ఉపశమనం కల్పిస్తుందని హరిబాబు తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగానికి, దేశ వృద్ధికి ఒక విజయమని.. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక ఊపును సృష్టించే ప్రగతిశీల చర్యగా భావిస్తున్నామన్నారు.